విడాకుల ఊరేగింపు.. అత్తింటినుంచి కుమార్తెను మేళతాళాలతో పుట్టింటికి తీసుకొచ్చిన తండ్రి...

By SumaBala Bukka  |  First Published Oct 18, 2023, 9:24 AM IST

అత్తింట్లో కూతురి ఇబ్బందులు చూడలేని ఓ తండ్రి తన ఇంటికి కూతుర్ని తెచ్చేసుకున్నాడు. దీనికోసం మేళతాళాలు, పటాసులతో భారీ ఊరేగింపు ఏర్పాటు చేశాడు. 


జార్ఖండ్ : ఓ తండ్రి  అత్తగారింట్లో తన కూతురు అనుభవిస్తున్న కష్టాలను చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే ఆమెను మేళతాళాలతో తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకొని, అంగరంగా వైభవంగా పెళ్లి చేసి పంపించిన తర్వాత అత్తగారింట్లో  కూతురు కష్టాలు పడడాన్ని ఏ తల్లిదండ్రులు జీర్ణించుకోలేరు. దీనికి సర్దుకుపోవాలని  చెప్పడమో.. ఏమీ చేయలేక తమలో తాము బాధపడడం చేస్తుంటారు. ఇంకొంతమంది పంచాయితీ పెట్టించి కూతురు కాపురం బాగుపడాలని ప్రయత్నిస్తుంటారు.  

కానీ ఈ తండ్రి మాత్రం కూతురి కష్టాలని చూడలేక ఏకంగా మేళ తాళాలు, బాణాసంచల మధ్య సందడిగా ఊరేగిస్తూ పుట్టింటికి తీసుకొచ్చేసాడు.జార్ఖండ్ లోని రాంచీలో జరిగిన ఈ అరుదైన ఘటన ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఈ ఘటన ఈనెల 15వ తేదీన జరిగింది..ఈ ఊరేగింపుకు సంబంధించిన వీడియో  తండ్రి స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన పేరు ప్రేమ్ గుప్తా. నిరుడు ఏప్రిల్ లో తన కూతురు సాక్షి గుప్తాను  సచిన్ కుమార్ అనే వ్యక్తికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు.

Latest Videos

పెళ్ళైన కొద్ది రోజులకే సచిన్  భార్యను వేధించడం మొదలుపెట్టాడు.  ఆ తర్వాతి క్రమంలో సచిన్ కు అంతకుముందే వివాహం అయినట్లు తెలిసింది. ఈ విషయాలు తెలిసినప్పటికీ భర్తతో విడిపోవడానికి ఇష్టపడని సాక్షి సర్దుకుపోవాలని చూసింది. కానీ, రోజురోజుకీ సాక్షి మీద వేధింపులు ఎక్కువయ్యాయి.  దీంతో తాను ఇక భర్తతో కలిసి ఉండటం కుదరదని సాక్షి నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. ఇక తాను ఎంత మాత్రం భర్తతో కలిసి ఉండలేనని విడాకులు తీసుకుంటానని ఆవేదనగా చెప్పుకొచ్చింది.

కూతురు చెప్పిన ఈ విషయాన్ని అందరూ తల్లిదండ్రులలాగా పరువుకి  ముడిపెట్టి చూడలేదు ఆ తల్లిదండ్రులు. కూతురి బాధను అర్థం చేసుకున్నారు. సాక్షి నిర్ణయాన్ని ఆమె తండ్రి, కుటుంబ సభ్యులు స్వాగతించారు. అత్తగారి ఇంటి నుంచి ఆమెను తిరిగి తమ ఇంటికి తీసుకురావడానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. కూతుర్ని తమ ఇంటి నుంచి ఎలా పంపించారో… అలాగే ఊరేగింపుగా టపాసులు కాలుస్తూ పుట్టింటికి తీసుకువచ్చారు. దీనిమీద ప్రేమ గుప్తా మాట్లాడుతూ.. కుమార్తెలు ఎంతో విలువైన వారు.. అత్తింట్లో వారికి ఇబ్బందులు ఎదురైతే అర్థం చేసుకోకుండా ఉండకుండా..  గౌరవంగా పుట్టింటికి తీసుకురావాలి అన్నారు. సచిన్తో  కూతురికి విడాకులు ఇప్పించడం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

click me!