డ్యాన్స్ చేస్తూ మరణించిన కొడుకు.. హాస్పిటల్ తీసుకెళ్లి షాక్‌తో ప్రాణాలొదిలిన తండ్రి

By Mahesh KFirst Published Oct 3, 2022, 7:30 PM IST
Highlights

మహారాష్ట్రలో తండ్రీ కొడుకులు నిమిషాల వ్యవధిలోనే కన్నుమూశారు. గార్బా ఆడుతూ ఇంటికి వెళ్లి వాంతులు చేసుకున్న కొడుకుని తీసుకుని తండ్రి ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఇంకా అడ్మిట్ కాకముందే కొడుకు చనిపోయాడు. అతన్ని చూసి అరిచిన అరుపులు విని తండ్రి కుప్పకూలిపోయాడు.
 

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో పండుగ పూట ఓ కుటుంబంలో తీరని విషాదం నిండింది. తండ్రీ కొడుకు నిమిషాల వ్యవధిలోనే మరణించారు. 35 ఏళ్ల కొడుకు గార్బా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా ఢీలా పడిపోయాడు. అతడిని తండ్రి ఆటో రిక్షాలో హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆ కొడుకు కుప్పకూలిపోయాడు. అదే సమయంలో ఆటోకు డబ్బులు ఇస్తున్న తండ్రి.. ఆ అరుపులు విని గుండెపోటుతో అక్కడే మరణించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా విరార్ పట్టణంలో చోటుచేసుకుంది.

35 ఏళ్ల మనీష్ కుమార్ జైన్ ఇమిటేషన్ జువెల్లరీ వ్యాపారి. ఆయన వీరార్ (వెస్ట్)లో అగర్వాల్ కాంప్లెక్స్‌లోని  ఎవర్‌షైన్ అవెన్యూ బిల్డింగ్‌లో గార్బా ప్లే చేశాడు. డ్యాన్స్ చేశాడు. శనివారం రాత్రి ఆయన డ్యాన్స్ చేస్తూనే ఒంట్లో నలతగా ఉన్నదని పక్కకు జరిగాడు. వెంటనే ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లగానే వాంతులు చేసుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న తండ్రి నర్పత్, ఆయన అన్నయ్య రాహుల్‌లు అలర్ట్ అయ్యారు. ఇద్దరు కలిసి మనీష్ కుమార్ జైన్‌ను ఆటో రిక్షాలో హాస్పిటల్ తీసుకెళ్లారు.  విరార్‌లోని సంజీవని హాస్పిటల్ తీసుకెళ్లారు.

మనీష్ కుమార్ జైన్‌ను రాహుల్ పట్టుకుని ఉన్నాడు. ఆ డబ్బులు ఇవ్వడానికి ఆటో దగ్గరే తండ్రి నర్పత్ ఉన్నాడు. మనీష్ కుమార్ జైన్‌ను తీసుకుని రాహుల్ ఎమర్జెన్సీ వార్డు వైపు నడవడం మొదలు పెట్టాడు. కానీ, మెడికల్ కౌంటర్ చేరగానే మనీష్ కుమార్ కుప్పకూలిపోయాడు. రాహుల్‌కు ఏం జరిగిందో అర్థం కాలేదు. వెంటనే సహాయం కోసం అరిచాడు. ఈ అరుపులు బయట ఆటోకు డబ్బులు ఇస్తున్న మనీష్ తండ్రి నర్పత్ చెవిన పడ్డాయి. అప్పుడే నర్పత్‌కు గుండె పోటు వచ్చింది. ఆటోలోనే కూలిపోయాడు.

వెంటనే వారిద్దరినీ హాస్పిటల్‌లోకి తీసుకెళ్లారు. కానీ, వారిద్దరూ అప్పటికే మరణించారని వైద్యులు చెప్పారు. ఆదివారం అంత్యక్రియలు జరిగాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారి అటాప్సీ రిపోర్టులు రావాల్సి ఉన్నది. ఆ పోస్టుమార్టం నివేదికలు వచ్చిన తర్వాతి వారి మరణాలకు అసలైన కారణం బయటపడుతుందని పోలీసులు చెప్పారు.

click me!