
Kashmir Files: 'ది కాశ్మీర్ ఫైల్స్' అనే చిత్రం దేశవ్యాప్తంగా సంచలన రేపుతోంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత ఎక్కడ చూసినా.. కాశ్మీరీ పండిట్ల వలస గురించి చర్చ సాగుతోంది. తాజాగా పార్లమెంట్ లో కాశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణాలు చర్చనీయంగా మారాయి. తాజాగా చిత్రంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మంగళవారం స్పందించారు. ఇది కేవలం ప్రచారం కోసం తీసిన చిత్రమేనని, నిర్దిష్టంగా ఒక మతానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నదని ఆరోపించారు. చిత్రం వాస్తవిక పరిస్థితులకు చాలా దూరంగా ఉందని అన్నారు.
1990లో చోటుచేసుకున్న ఘటనలు, కశ్మీరీ పండిట్ల వలసలకు నేను బాధ్యుడినని రుజువైతే దేశంలో ఎక్కడైనా ఉరితీయండి.. ఇందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఉద్వేగంగా అన్నారు. కాశ్మీరీ పండిట్ల వలసల సమయంలో ఏమి జరిగిందో ? తెలుసుకోవడానికి నిజాయితీ ఉన్న న్యాయమూర్తి లేదంటే కమిటీని నియమిస్తే అని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. 1990లో జరిగింది అది విషాదమే.. ఆ సమయంలో తన కాశ్మీరీ పండిట్ సోదరులు, సోదరీమణులు తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చిందని, ఆ పరిస్తితికి కారకులెవరో తెలుసుకోవాలని కోరుకుంటున్నానని అబ్దుల్లా అన్నారు.
నాటి ఘటనలు.. హిందువులు, ముస్లిములు అనే తేడా లేకుండా ప్రతిఒక్కరిని కలిచివేశాయనీ, ప్రతి ఒక్కరి జీవితాల్లో విషాదాన్ని నింపిందని గుర్తు చేశారు. అయితే ఈ సంఘటనలను కొన్ని పార్టీలు తమకు అనుకూల ప్రచారం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీరీ పండిట్లు వలస వెళ్లే సమయంలో అప్పటి గవర్నర్ జగ్మోహన్ మల్హోత్రానే వారిని బస్సులో ఎక్కించి పంపించారని అబ్దుల్లా గుర్తుచేశారు. రెండు నెలల్లో తిరిగి తీసుకువస్తామని ఇచ్చిన హామీ 32 ఏండ్లు గడిచినా అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు తాను ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలను తోసిపుచ్చిన అబ్దుల్లా.. జడ్జి చేత విచారణ లేదా కమిటీవేస్తే వాస్తవాలు బయటపడుతాయన్నారు.
అదే నిజమని రుజువైతే ఉరికైనా తాను సిద్ధమని అన్నారు. నిజాయితీ ఉన్న న్యాయమూర్తి లేదంటే కమిటీని నియమిస్తే.. నిజం ఏంటో వెలుగు చూస్తుంది. కశ్మీర్ పండిట్ల వలసలకు, ఆనాటి ఘర్షణకు కారణం ఎవరో బయటపడుతుంది. విచారణకు నేను సిద్ధం. కానీ, సంబంధం లేని వాళ్లపై నిందలు వేయడం సరికాదు’’ అంటూ ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారాయన.
‘‘ఆనాటి పరిస్థితులకు తెలుసుకోవాలనుకునేవాళ్లు.. ఆనాటి ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్‌నుగానీ, ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న అరిఫ్ మహమ్మద్(ప్రస్తుత కేరళ గవర్నర్)నుగానీ సంప్రదించ్చొచ్చు. అలాగే విచారణ కోసం నియమించే కమిటీ ఏదైతే ఉందో అది కేవలం కశ్మీర్ పండిట్ల కోసమే కాకుండా సిక్కులకు, ముస్లింలకు ఏం జరిగిందో కూడా విచారణ చేపడితే మంచిదని వ్యాఖ్యానించారాయన. సినిమాను కేవలం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న వాళ్లు.. ఆనాటి పరిస్థితులకు కారణం ఎవరనేది కూడా గుర్తిస్తే మంచిదని పేర్కొన్నారు.
గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా తాను పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఈ ఘటనపై కమిషన్‌ను ఏర్పాటు చేయాలని వాదిస్తున్నారని అబ్దుల్లా చెప్పారు. 1997లో జమ్మూ కాశ్మీర్ వలసదారుల స్థిరాస్తి (పరిరక్షణ, రక్షణ ,కష్టాల అమ్మకాలపై నియంత్రణ) చట్టాన్ని తీసుకొచ్చింది తన ప్రభుత్వమేనని అతను చెప్పాడు.
అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వ హయాంలో హైజాక్ చేయబడిన ఇండియన్ ఎయిర్‌లైన్ విమాన ప్రయాణీకులకు బదులుగా 1999లో ముగ్గురు భయంకరమైన టెర్రరిస్టులను విడుదల చేయడాన్ని వ్యతిరేకించింది తమ ప్రభుత్వమేనని కూడా మాజీ ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇతరులు తనపై అకృత్యాలు పాల్పడేందుకు తాను సిద్ధంగా లేనని అబ్దుల్లా అన్నారు.