
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశంసలు కురిపించారు. రాహుల్ గాంధీ పప్పు కాదని, అతనిపై చేస్తున్న కామెంట్స్ పూర్తిగా తప్పని, ఆయనకు చాలా విషయాలపై అవగాహన ఉందని అన్నారు. నెల రోజుల క్రితం రాహుల్‌తో భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆయన.. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పై రాజన్ ఘాటుగా ప్రశంసలు కురిపించారు
‘‘వాస్తవానికి దురదృష్టవశాత్తూ అతడికి (రాహుల్ గాంధీ) అలాంటి పేరు వచ్చింది. కానీ గత పదేళ్లుగా నేను అతడితో మాట్లాడుతూనే ఉన్నాను. కొంత మంది అంటున్నట్లు అతడేమీ పప్పు కాదు. అతడు చాలా తెలివైన వ్యక్తి. యువరక్తం ఉన్నవాడని అన్నారు. రాహుల్ గాంధీకి చెడు పేరు రావడం .. చాలా దురదృష్టకరమని రఘురామ్ రాజన్ అన్నారు. గత దశాబ్దకాలంగా రాహుల్ గాంధీతో అనేక అంశాలపై చర్చించాననీ, అతను అస్సలు పప్పు కాదు. అతను చాలా తెలివైనవాడని అన్నారు.
యువకుడు, పరిశోధనాత్మక వ్యక్తని ప్రశంసించారు. అలాంటి వ్యక్తి ప్రాధాన్యత ఏమిటో తెలుసుకోవాలని, ఆయన ఎంతో ఉత్సాహంతో, ఆశతో ఉండే వ్యక్తనీ, ఆయన నిరంతరం తనను తాను మలుచుకోవడానికి, మార్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడనీ, సమాజంలో ఏది ప్రధాన్యమో, ఏది అప్రాధాన్యమో అతడికి బాగా తెలుసని, అతడు చేస్తున్న పనికి సరైన వ్యక్తని రఘురాం రాజన్ అన్నారు. అదే సమయంలో తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని తేల్చిచెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను భారత్ జోడో యాత్రలో పాల్గొన్నానని, ఆ యాత్రలోని సిద్ధాంతాలను నేను నమ్ముతాను. నేను అతనితో నిలబడి ఉన్నాను. నేను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. అదేసమయంలో మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో కూడా తాను అనేక విషయాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డానని స్పష్టంగా చెప్పారు.
భారత్ జోడో యాత్రలో రాజన్ ఏం చెప్పారు?
2023 భారతదేశానికి మరింత సవాలుగా మారబోతోందని రఘురామ్ రాజన్ ఆ సమయంలో అన్నారు. ఈ ఏడాది కూడా యుద్ధం, ఇతర కారణాల వల్ల ప్రపంచం ఆర్థికంగా చితికిపోయిందని, అయితే వచ్చే ఏడాది మరింత కష్టతరంగా మారబోతోందని అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. అభివృద్ధికి అవసరమైన సంస్కరణలను సిద్ధం చేయడంలో భారత్ , ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు విఫలమయ్యాయని రఘురామ్ రాజన్ అన్నారు.
కొద్దిమంది ధనవంతుల చేతుల్లో ప్రభుత్వం కేంద్రీకరించబడిందనీ, మనం పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా ఉండలేమని, అయితే పోటీ కోసం పోరాడాలని రాహుల్‌కు వివరించారు. తాను మార్కెట్‌లో గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఉండవచ్చు. చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు దేశానికి మేలు చేస్తాయి కానీ గుత్తాధిపత్యం దేశానికి మంచిది కాదని సూచించారు.