కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణకు తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రిలో చికిత్స

By Siva KodatiFirst Published Sep 25, 2022, 4:26 PM IST
Highlights

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత ఇన్‌ఫెక్షన్‌తో ఆయన బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఎస్ఎం కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై పలువురు ప్రముఖులు ఆరా తీస్తున్నారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత ఇన్‌ఫెక్షన్‌తో ఆయన బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. కృష్ణ వయసు 90 ఏళ్లు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతోన్న ఆయనను శనివారం రాత్రి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. గత కొంతకాలంగా ఎస్ఎం కృష్ణ.. గుండె సంబంధిత వ్యాధితోనూ, వయోభారంతోనూ ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్‌ను అందిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మూడు నాలుగు రోజుల పాటు పరిశీలించిన అనంతరం కృత్రిమ శ్వాస పరికరాలను తొలగిస్తామని చెబుతున్నారు. ఎస్ఎం కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై పలువురు ప్రముఖులు ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. 

కాగా.. కర్ణాటకతో పాటు దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు ఎస్ఎం కృష్ణ. 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత మహారాష్ట్ర గవర్నర్‌గానూ పనిచేశారు. 2009 నుంచి 2012 వరకు మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో విదేశాంగ శాఖ మంత్రి కృష్ణ వ్యవహరించారు. అయితే 2017లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 
 

click me!