పీఎఫ్‌ఐకి నిధుల తరలింపుపై ఈడీ ఫోకస్.. కీలకంగా తేజన్ వార్తాపత్రిక..!

By Sumanth KanukulaFirst Published Sep 26, 2022, 9:31 AM IST
Highlights

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు(పీఎఫ్‌ఐ) నిధుల తరలింపుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రధానంగా దృష్టి సారించింది. విదేశాల నుంచి అక్రమమార్గాల్లో పీఎఫ్‌కి నిధులు వచ్చినట్టుగా ఈడీ తెలిపింది. 

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు(పీఎఫ్‌ఐ) నిధుల తరలింపుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రధానంగా దృష్టి సారించింది. కొన్ని సంవత్సరాలుగా  పీఎఫ్‌ఐ, సంబంధిత సంస్థల ఖాతాలలో రూ. 120 కోట్ల కంటే ఎక్కువ మొత్తం జమ చేయబడినట్టుగా ఈడీ ఇదివరకే గుర్తించిన సంగతి తెలిసిందే. అయితే అవి భారత్‌లోని చిన్న చిన్న నగదు విరాళాల ద్వారా వచ్చిన మొత్తం అని ఫీఎఫ్‌ఐ చెబుతూ వచ్చింది. అయితే పీఎఫ్‌ఐ వాదనలో వాస్తవం లేనట్టుగా తెలుస్తోంది. పీఎఫ్‌ఐకి గల్ఫ్ దేశాల్లో వేలాది మంది యాక్టివ్ సభ్యులు ఉన్నారని, అక్కడ వారు గణనీయమైన నిధులను సేకరించి హవాలా లావాదేవీల ద్వారా భారత్‌కు పంపుతున్నారని ఈడీ తెలిపింది.  


భారతదేశం, గల్ఫ్‌ దేశాలలో తేజస్ వార్తాపత్రిక పీఎఫ్‌ఐ మౌత్‌పీస్‌గా పనిచేసిందని.. ఆ సంస్థ నిధులు సేకరించిందని, నకిలీ విరాళాల రశీదులను సృష్టించడం ద్వారా భారతదేశంలోని అధికారులను తప్పుదారి పట్టించిందని తమ దర్యాప్తులో వెల్లడైందని ఈడీ తెలిపింది. ప్రస్తుతం దర్యాప్తు సంస్థల అదుపులో ఉన్న పలువురు పీఎఫ్‌ఐ ఆఫీస్ బేరర్లు.. అబుదాబిలోని దర్బార్ రెస్టారెంట్‌ను అన్ని హవాలా లావాదేవీలకు, భారతదేశానికి అక్రమ బదిలీకి డెన్‌గా ఉపయోగించుకున్నారని ఈడీ పేర్కొంది. 

‘‘పీఎఫ్‌ఐపై మనీల్యాండరింగ్ కేసులో గతంలో అరెస్టయిన అబ్దుల్ రజాక్ బీపీ.. దర్బార్ రెస్టారెంట్ ద్వారా పీఎఫ్‌ఐ, సంబంధిత సంస్థల మనీలాండరింగ్ కార్యకలాపాలను నిర్వహించడంలో పాలుపంచుకున్నాడు. అతను అబుదాబిలోని దర్బార్ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్న అతని సోదరుడి నుంచి ఈ ఆదాయాన్ని అందుకున్నాడు’’ అని ఈడీ తెలిపింది. రజాక్‌కు చెందిన మరో కంపెనీ తమర్ ఇండియా స్పైసెస్ ప్రైవేట్ లిమిటెడ్  కూడా నేరాల ఆదాయాన్ని లాండరింగ్ చేయడానికి ఉపయోగించబడిందని ఈడీ విచారణలో తేలింది. 

ఇక, పీఎఫ్‌ఐ కార్యాలయాలపై ఎన్‌ఐఏ దాడుల తర్వాత..  ఆ సంస్థ ఆర్థిక కార్యకలాపాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టిసారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాట్నాలో ప్రధాని మోదీపై దాడి చేసేందుకు పీఎఫ్ఐ కుట్ర చేసినట్టుగా తేలింది. ప్రధాని మోదీ ర్యాలీతో పాటు.. ఉత్తరప్రదేశ్‌లోని సున్నితమైన ప్రదేశాలు, వ్యక్తులపై ఏకకాలంలో దాడులు చేసేందుకు టెర్రర్ మాడ్యూల్స్, మారణాయుధాలు, పేలుడు పదార్థాల సేకరణలో పీఎఫ్‌ఐ నిమగ్నమైందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. 

click me!