
Defence land under probe: దేశంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం నాడు ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. ప్రస్తుతం జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో డజనుకు పైగా ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
వివరాల్లోకెళ్తే.. ఇండియన్ ఆర్మీ భూములను అక్రమంగా ఆక్రమించిన వారిపై మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోని దాదాపు డజను ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్‌లో నాలుగు చోట్ల, జార్ఖండ్‌లో ఎనిమిది చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. సోదాలు చేసిన ప్రదేశాలలో కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్త అమిత్ అగర్వాల్‌తో పాటు మరికొంతమంది నివాసాలు, కార్యాలయ ప్రాంగణాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపినట్టు హిందుస్తాన్ టైమ్స్ నివేదించింది. నివేదికల ప్రకారం.. అగర్వాల్‌ను ఇంతకుముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఈ కేసులో అతను వెల్లడించిన తర్వాత దాడులు ప్రణాళికలు సిద్దం చేసినట్టు సమాచారం.
జార్ఖండ్‌లోని అనేక ఎకరాల ఆర్మీ భూములను 'ల్యాండ్ మాఫియా'లు, రాజకీయ నాయకులతో కలిసి అక్రమంగా ఆక్రమించినట్లు తెలిసింది. మనీలాండరింగ్ కేసులో అమిత్ అగర్వాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గత నెలలో అరెస్టు చేసింది. జూలై 31న కోల్‌కతాలో న్యాయవాది రాజీవ్ కుమార్ నుండి ₹ 50 లక్షలు స్వాధీనం చేసుకున్న కేసులో అమిత్ అగర్వాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. జార్ఖండ్‌లోని బిర్సా ముండా సెంట్రల్ జైలులో ఉన్న అగర్వాల్, జార్ఖండ్ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం నుండి తన పేరును తొలగించడానికి కుమార్‌కు డబ్బు ఇచ్చారని ఆరోపించారు. పీఎంఎల్‌ఎ కోర్టులో అగర్వాల్‌పై ఈడీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు కూడా దాఖలు చేసింది.