
న్యూఢిల్లీ: కొన్నిసార్లు చాలా సింపుల్ విషయాలు పెద్ద చర్చను తీస్తాయి. కొన్ని సార్లు మన చుట్టూ జరుగుతున్నా పట్టించుకోని అంశాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. అవి మరోసారి కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. ఇదంతా సోషల్ మీడియాకు ఉన్న శక్తి. ఇటీవలే సోషల్ మీడియాలో మరో అంశం వైరల్ అయింది. ఓ ఉద్యోగి తన బాస్‌కు రాసిన లీవ్ లెటర్ తెగ వైరల్ అయిపోతున్నది. ఇంతకీ ఆ లీవ్ లెటర్‌లో ఏమున్నదంటే?
డియర్ సార్ అని సంబోధిస్తూ.. గుడ్ మార్నింగ్ అని చెబుతూ.. తనకు సెలవు కావాలని ఉద్యోగి తన లీవ్ అప్లికేషన్‌ను బాస్‌కు మెయిల్ చేశాడు. తాను మరో కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లుతున్నారని, కాబట్టి, తనకు ఒక రోజు సెలవు ఇవ్వాలని కోరుతున్నట్టు ఆ ఉద్యోగి రాసుకొచ్చాడు. తనకు సెలవు మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నాడు.
ఈ లీవ్ అప్లికేషన్‌ను ఆ బాస్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. తన జూనియార్లు చాలా స్వీట్ అని సాహిల్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ఆ పోస్టు షేర్ చేస్తూ పేర్కొంది. ఏకంగా ఓ ఇంటర్వ్యూకు హాజరు కావడానికి సెలవు అడిగారని వివరించింది. ఆ మెయిల్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఉద్యోగి నిజాయితిపై ప్రశంసలు కురిపించారు. వేరే కంపెనీలో ఉద్యోగానికి ఇంటర్వ్యూ వెళ్లుతున్న విషయాన్ని నిజాయితీగా పేర్కొని సెలవు కోరడం నిజంగా అరుదు అని నెటిజన్లు చర్చిస్తున్నారు. కొందరేమో అది నిజాయితీ అలాగే, అమాయకత్వం కూడా అంటూ కామెంట్లు చేశారు.
మరొకరు ఇదే సందర్భంగా ఓ ఇన్సిడెంట్‌ను గుర్తు చేసుకున్నారు. తన ఫ్రెండ్ ఒకరు అద్దె గదిలో ఉండేవాడని, ఒక రోజు ఇంటి ఓనర్ బ్రేక్ ఫాస్ట్ కోసం ఆహ్వానిస్తా వెళ్లాడని పేర్కొన్నాడు. బ్రేక్ ఫాస్ట్ తిన్న తర్వాత న్యూస్ పేపర్ యాడ్ బుకింగ్ చేసే చోటుకు వెళ్లి వస్తావా? అని ఓనర్ తన ఫ్రెండ్‌ను కోరగా.. ఆ విజ్ఞప్తిని తన ఫ్రెండ్ గౌరవంగా స్వీకరించాడని వివరించాడు. కానీ, తీరా చూస్తే.. ఆ యాడ్ తాను గదిని కొత్తవారికి అద్దెకు ఇవ్వడానికి సంబంధించినది తెలుసుకుని తన ఫ్రెండ్ షాక్ అయ్యాడని ఆ యూజర్ పేర్కొన్నాడు.
మరొకరు అదే విధంగా ఓ రాజీనామా లేఖను పోస్టు చేశారు. షార్ట్ అండ్ స్వీట్ అంటూ కామెంట్ చేస్తూ రిజైన్ లెటర్ పోస్టు చేశారు. అందులో డియర్ సార్ అని, రాజీనామా గురించి అని పేర్కొని.. సింపుల్‌గా బై బై సార్ అని రాసి ఉన్నది. చివరగా సంతకం ఉన్నది.