నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు, షెడ్యూల్ ఇదే.. 80 ఏళ్లు నిండితే ఇంటి నుంచే ఓటు

By Siva KodatiFirst Published Oct 14, 2022, 3:40 PM IST
Highlights

దేశంలో కీలక రాష్ట్రాలైన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఎన్నికల నగరా మోగింది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీల గడువు ముగియనుండటంతో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం.  నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు వుంటుందని ఆయన చెప్పారు.

దేశంలో కీలక రాష్ట్రాలైన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఎన్నికల నగరా మోగింది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీల గడువు ముగియనుండటంతో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. సీఈసీ రాజీవ్ కుమార్ ఈ మేరకు ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో షెడ్యూల్ విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఈసీ తెలిపారు. 80 ఏళ్లు నిండిన వాళ్లు ఇంటి నుంచే ఓట్లు వేసే అవకాశం కల్పిస్తామని ఆయన ప్రకటించారు. నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు వుంటుందని ఆయన చెప్పారు. అక్టోబర్ 17న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని.. 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, 27న నామినేషన్లను పరిశీలిస్తామని, అక్టోబర్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధిస్తున్నట్లు సీఈసీ తెలిపారు. 

హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే.. ఇక్కడ మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే 43, కాంగ్రెస్ 22 స్థానాలను దక్కించుకున్నాయి. జనవరి 8, 2023తో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు ముగియనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోనూ నిరుద్యోగం, పేదరికం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. 

అటు ... ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు సొంత రాష్ట్రమైన గుజరాత్ విషయానికి వస్తే.. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి సంబంధించి 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 99, కాంగ్రెస్‌ 77 స్థానాలను దక్కించుకున్నాయి. పలుమార్లు ఉపఎన్నికలు జరిగిన కారణంగా ఇక్కడ బీజేపీ బలం 111కే చేరింది. ఈసారి ఈ రెండు జాతీయ పార్టీలకు ఆమ్ ఆద్మీ పార్టీ షాకిచ్చేందుకు సిద్ధమైంది. నిరుద్యోగ భృతి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై హామీలు ఇస్తూ యువతను లక్ష్యంగా చేసుకుంది. 
 

 

click me!