maharashtra crisis: మహా సంక్షోభంలో ట్విస్ట్.. గౌహతీలో శివసేన ఎమ్మెల్యేల బలప్రదర్శన

By Siva KodatiFirst Published Jun 23, 2022, 2:19 PM IST
Highlights

మహారాష్ట్ర సంక్షోభం నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గౌహతీలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో వున్న శివసేన ఎమ్మెల్యేలంతా ఒకే వేదికపైకి వచ్చారు. ఇందుకు సంబంధించి ఏక్‌నాథ్ శిండే వర్గం ఓ వీడియో రిలీజ్ చేసింది. 

మహారాష్ట్ర సంక్షోభం (maharashtra crisis) నేపథ్యంలోని అక్కడి రాజకీయాలు గంట గంటకూ మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గౌహతిలో శివసేన ఎమ్మెల్యేలు (shivsena) బలప్రదర్శన నిర్వహించారు. ఓ ప్రైవేట్ హోటల్‌లో వున్న ఎమ్మెల్యేలంతా ఒకే వేదికపైకి వచ్చారు. ఏక్‌నాథ్ శిండే క్యాంపులో (eknath shinde) మొత్తం 42 మంది ఎమ్మెల్యేలు వుండగా.. వీరిలో 35 మంది శివసేన ఎమ్మెల్యేలైతే, మిగతా ఏడుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు. శివసేన ఎల్పీ నేతగా అజయ్ చౌదరిని (ajay chaudhary ) గుర్తిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 

ఇకపోతే.. శివసేన పార్టీ అంతర్గత వ్యవహారం రాష్ట్ర సమస్యగా మారిపోయింది. ఇప్పుడు శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే (uddhav thackeray) , శివసేన రెబల్ ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి ఏక్‌నాథ్ షిండే మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తున్నది. ఆ యుద్ధ ఫలితమే రాష్ట్ర ప్రభుత్వ భవితవ్యాన్ని నిర్దేశించనుంది. తొలుత గుజరాత్‌లో క్యాంప్ వేసిన ఏక్‌నాథ్ షిండే అండ్ కో ఇప్పుడు గౌహతిలో ఉన్నారు. వీరిని ఉద్దేశిస్తూ ఉద్ధవ్ ఠాక్రే నిన్న ప్రసంగంలో కీలక విషయాలు మాట్లాడారు. ఇందుకు సమాధానంగా ఇప్పుడు రెబల్ క్యాంప్ నుంచి ఓ లేఖ విడుదలైంది.

తాజాగా ఏక్‌నాథ్ షిండే రెబల్ క్యాంప్‌లో చేరిన శివసేన ఎమ్మెల్యే దీపక్ కేసర్కార్ ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ.. తాము ఉద్ధవ్ ఠాక్రేను సీఎం పదవి నుంచి తొలగిపోవాలని కోరట్లేదని అన్నారు. అయితే, బీజేపీతో పొత్తు పెట్టుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. అలాగే, రెబల్ ఎమ్మెల్యే నుంచి ఓ లేఖ విడుదలైంది. అందులోనూ వారు ఉద్ధవ్ ఠాక్రేపై ప్రశ్నల వర్షం కురిపించారు. మూడు పేజీ లేఖను వారు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

శివసేన ఎమ్మెల్యేలు కోరుకునేది ఇదేనని, ఇదే నిజం అని ఏక్‌నాథ్ షిండే పేర్కొంటూ.. తాను మహారాష్టకు రానని తెలిపారు. ఆ లేఖలో రెబల్ ఎమ్మెల్యేలు అయోధ్య, రామ మందిరం, హిందూత్వలను ప్రస్తావించారు. రామ మందిరం, అయోధ్య, హిందూత్వ శివసేన లేవనెత్తిన అంశాలు కావా? అని ప్రశ్నించారు. అలాంటప్పుడు శివసేన ఎమ్మెల్యేలు అయోధ్యకు పర్యటిస్తామంటే.. ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు అడ్డుకున్నారని అడిగారు. కేవలం ఆదిత్య ఠాక్రే మాత్రమే అయోధ్యకు వెళ్లాలని అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. పలువురు ఎమ్మెల్యేలు ముంబయి ఎయిర్‌పోర్టు చేరుకున్న తర్వాత ఆయన పర్సనల్‌గా ఫోన్ చేసి ఆపారని, ఏక్‌నాథ్ షిండే మరికాసేపట్లో విమానం ఎక్కబోతుండగా ఆపేశారని వివరించారు. హిందూత్వ పార్టీ అయినప్పుడు వారిని అయోధ్యకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. 

బ్యూరోక్రాట్లు తమను గౌరవించట్లేదని, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల ముందు తాము అవమానాలకు గురవుతున్నామని తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రేను కలవడానికి ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలకు అనుమతులు ఉంటాయని, తమకు రెండున్నరేళ్లుగా సీఎం రూమ్ మూసే ఉన్నదని ఆరోపించారు. వారికి ఫండ్స్ వస్తుంటే.. తమకేమీ ఫండ్స్ అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని వివరించారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఏక్‌నాథ్ షిండే తమకు మద్దతు ఇచ్చారని తెలిపారు. సీఎం తన ప్రసంగం భావోద్వేగంగా మాట్లాడారని, కానీ, తమ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదని, అందుకే ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు.

click me!