Kejriwal: వేసవి కాలంలో మామిడి పండ్లను ఆస్వాదించని వారుండరు. ఈ సీజన్ లో అధికంగా దొరికే ఈ పండ్లు అంటే చాలా మందికి ఇష్టం. అయితే.. ఈ పండ్లను ఒకరు ఆరోగ్యం పాడు చేసుకోవాలనే దురుద్దేశంతో కావాలనే అధికంగా తింటున్నారని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పని చేసే ఓ సంస్థ తెలిపింది. ఇంతకీ ఆ కథేంటి?
Kejriwal: ఎండాకాలంలో మామిడి పండ్లు విరివిరిగా లభిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ పండ్లు ఏడాది పాటు లభించినా.. వేసవికాలంలోనే దేశంలోని చాలా ప్రాంతాల్లో తక్కువ ధరకు లభిస్తాయి.నిజంగా ఈ పండ్లంటే ఇష్టపడని వారుండరంటే.. అతిశయోక్తి కాదు. అందుకే మామిడికి పండ్ల రారాజు అని పేరు ఉంది. అలాంటి మామిడి పండ్లను తింటే ఏమైంది? ఇదేం ప్రశ్న అని అనుకుంటాన్నారా ? సాధారణంగా అయితే పండ్లు తిన్నామన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం ఈ పండ్లు తింటే బెయిల్ వస్తుందని భావిస్తున్నారట. ఈ విషయం స్వయంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కోర్టులో వెల్లడించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనకు మధుమేహం ఉందని, కానీ మెడికల్ బెయిల్ కోసం రక్తంలో చక్కెర స్థాయిని పెంచడానికి రోజూ మామిడి పండ్లు, ఆలూ పూరీ, స్వీట్లు తింటున్నారని ఈడీ గురువారం కోర్టుకు తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ తన రెగ్యులర్ డాక్టర్ కన్సల్టేషన్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారణ సందర్భంగా ఈడీ ఈ ప్రకటన చేసింది. ఇంట్లో వండిన భోజనం తినడానికి కేజ్రీవాల్ కు అనుమతి ఉందని, కానీ ఆయన కావాలనే, అనారోగ్య కారణాలు చూపుతూ బెయిల్ పొందడానికి ఆలూ ఆలూ సబ్జీ, పూరీ, స్వీట్లు, మామిడి పండ్లు వంటి అధిక చక్కెర కంటెంట్ ఉన్న ఆహారాన్ని తింటున్నారని ఈడీ పేర్కొంది. వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని ఆయన కూడా బాగా తెలుసని ఈడీ తరఫు న్యాయవాది తెలిపారు.
మెడికల్ ఎమర్జెన్సీని కావాలని సృష్టించడానికి, వైద్య కారణాల చూపుతూ.. బెయిల్ పొందే ప్రయత్నం చేస్తున్నారని ఈడీ పేర్కొంది. 24 గంటలూ జైలులో వైద్యులు అందుబాటులో ఉండరని, అయినప్పటికీ కేజ్రీవాల్ రక్తంలో చక్కెర స్థాయిలను రోజుకు రెండు సార్లు కొలుస్తున్నారని ఈడీ చెప్పింది. ఏప్రిల్ 1న కేజ్రీవాల్ రక్తంలో చక్కెర స్థాయి 139 మిల్లిగ్రామ్/ డీఎల్ ఉండగా.. ఏప్రిల్ 14 ఉదయం నాటికి 276 ఎంజీ/డీఎల్ గా నమోదైనట్లు ఈడీ తెలిపింది.
అయితే దీనిపై కేజ్రీవాల్ తరఫు న్యాయవాది స్పందించారు. మీడియా ఫోకస్ కోసం మాత్రమే ఈడీ ఇలాంటి ప్రకటనలు చేస్తోందని అన్నారు. మధుమేహంతో బాధపడుతున్న వారికి అసలు ఇవన్నీ ఎవరైనా ఇస్తారా అని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. అరవింద్ కేజ్రీవాల్ తీసుకుంటున్న ఆహారంపై నివేదిక సమర్పించాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. దీనిపై శుక్రవారం కూడా కోర్టు విచారణ జరగనుంది. ఈ విషయం వైరల్ కావడంతో వాట్ ఏ కేజ్రీ ఐడియా అని పలువురు భావిస్తున్నారు.