కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కు ఈడీ సమన్లు.. మనీలాండరింగ్ కేసు విచారణకు హాజరవ్వాలని ఆదేశం

By Mahesh KFirst Published Oct 2, 2022, 3:49 PM IST
Highlights

కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కు ఓ మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు పంపింది. ఈ నెల 7వ తేదీన విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. 
 

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కు ఈడీ సమన్లు పంపింది. ఓ మనీలాండరింగ్ కేసులో ఈ సమన్లు డీకే శివకుమార్‌కు అందాయి. ఈ నెల 7వ తేదీన ఏజెన్సీ ముందు హాజరు  కావాలని ఆదేశాలు ఉన్నాయి.

గతంలోనూ అటే సెప్టెంబర్ 19న ఢిల్లీలోనీ ఈడీ కార్యాలయంలో డీకే శివకుమార్‌ను ఏజెన్సీ సుమారు 5 గంటలు ప్రశ్నించింది. తనను నేషనల్ హెరాల్డ్ కేసులోనూ విచారించారని అప్పుడు శివకుమార్ తెలిపారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీల సారథ్యంలోని యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రస్ట్‌కు తన కుటుంబం చేసిన విరాళాలపై ప్రశ్నలు వేసిందని వివరించారు.

2019 సప్టెంబర్ 3వ తేదీన మరో మనీలాండరింగ్ కేసులో శివకుమార్‌ను ఈడీ అరెస్టు చేసింది. అదే ఏడాది అక్టోబర్‌లో ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఈడీ ఈ ఏడాది మే నెలలో శివకుమార్ సహా ఇతరులపై చార్జిషీటు ఫైల్ చేసింది. డీకే శివకుమార్ పై ఐటీ దాఖలు చేసిన చార్జి షీట్ ఆధారంగా ఈడీ చార్జిషీటు ఫైల్ చేసింది.

తాజా కేసు మాత్రం.. అవినీతి ఆరోపణలతో దాఖలైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఉన్నదని  చెబుతున్నారు.

డీకే శివకుమార్ హవాలా ట్రాన్సాక్షన్స్ చేశాడని ఐటీ శాఖ ఆరోపించింది. ఢిల్లీ, బెంగళూరులోని నెట్‌వర్క్ సహాయంతో ఆయన డబ్బును బార్డర్ దాటించాడని పేర్కొంది. డీకే శివకుమార్, ఆయన కూతురు 2017 జులైలో సింగపూర్‌కు వెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి. లెక్కకురాని రూ. 429 కోట్ల డబ్బులతో డీకే శివకుమార్‌కు లింక్ ఉన్నదని ఐటీ ఆరోపించింది. 2017లో డీకే శివకుమార్ పై ఈడీ రైడ్ చేసింది.

click me!