
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) నిధులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరోపణల నేపథ్యంలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోషియల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) జాతీయ అధ్యక్షుడు ఎం.కె. ఫైజీని అరెస్టు చేసింది. కేరళలోని పలక్కాడ్‌కు చెందిన 55 ఏళ్ల ఫైజీని సోమవారం రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. గత నెల 28న ఇడి అధికారులు ఫైజీ నివాసంలో సోదాలు నిర్వహించిన కొన్ని రోజుల తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం 2022 సెప్టెంబరు 28న పిఎఫ్ఐ, దాని సంబంధించిన ఎనిమిది అనుబంధ సంస్థలను నిషేధించింది. PFI సంస్థకు ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంలో పాత్ర ఉందని ఆరోపిస్తూ, కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. SDPI ఆఫీసులు కూడా అప్పట్లో నిఘా సంస్థల దృష్టిలోకి వచ్చాయి.
ఇడి ఇప్పటి వరకు PFI నుంచి SDPIకి ₹4.07 కోట్ల నిధులు బదిలీ అయినట్లు గుర్తించింది. మొత్తం 26 మంది PFI సభ్యులను అరెస్టు చేసిన ఇడి, తొమ్మిది చార్జ్‌షీట్లు దాఖలు చేయడంతో పాటు రూ. 61.72 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. SDPI వ్యవస్థాపక సభ్యుడైన ఫైజీతో పాటు, పిఎఫ్ఐ మాజీ చైర్మన్‌లు ఒఎమ్‌ఎ సలాం, ఇ. అబూబక్కర్‌లను కూడా ఇడి అరెస్టు చేసింది.
2022లో ఫైజీకి, కేరళకు చెందిన పిఎఫ్ఐ నేత అబ్దుల్ రజాక్ బీపీకి మధ్య జరిగిన లావాదేవీలను ఈడీ గుర్తించింది. రజాక్ రూ. 2 లక్షలను ఒక ఖాతాలోకి బదిలీ చేసినట్లు బయటపడింది. ఈడీ కోర్టులో సమర్పించిన రిమాండ్ నోట్‌లో, "PFI-SDPI సభ్యత్వం పరస్పరం ఒకేలా ఉండటం ఉండటం, SDPI స్థాపనలో PFI నేతల ప్రమేయం ఉండటం, ఆర్గనైజేషన్ ఆస్తులను కలిపి వినియోగించడం, SDPIకి నిధులు సమకూర్చడం వంటి అంశాలు ఈ రెండు సంస్థల మధ్య బలమైన అనుబంధాన్ని వెల్లడిస్తున్నాయి" అని పేర్కొంది.
ED దర్యాప్తులో SDPIకి పిఎఫ్ఐ నిధులను సమకూర్చినట్లు తేల్చింది. 2019లో SDPIని ఒక రాజకీయ పార్టీగా ఏర్పాటు చేసినా, ఇది నిజానికి పిఎఫ్ఐ ముసుగులో ఉన్న వేదిక అని నిఘా సంస్థలు గుర్తించాయి. PFI అధ్వర్యంలో SDPI ఎన్నికల వ్యూహాలను రూపొందించుకోవడం, పబ్లిక్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం, క్యాడర్ మోబిలైజేషన్ వంటి కార్యక్రమాలను అమలు చేసిందని ED పేర్కొంది.
ఈ అరెస్టును SDPI తీవ్రంగా ఖండించింది. ఇది ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యగా వర్ణించింది. SDPI తన అధికారిక ఎక్స్‌లో "ఈ అరెస్ట్ కేవలం రాజకీయ వ్యతిరేకులను అణచివేసే కుట్రలో భాగం మాత్రమే" అని పేర్కొంది. 2023లో, 2016లో RSS నాయకుడు ఆర్. రుద్రేశ్ హత్య కేసులో SDPI సభ్యుడు ఘౌస్ నాయక్‌ను NIA అరెస్టు చేసింది. 2010లో, కేరళలోని మువట్టుపుజా ప్రాంతంలో న్యూమాన్ కాలేజ్ ప్రొఫెసర్ టీజే జోసెఫ్‌పై జరిగిన దాడిలో PFI, SDPI సభ్యుల హస్తం ఉన్నట్లు NIA పేర్కొంది.
ఇడి దర్యాప్తు సాగుతున్న నేపథ్యంలో, PFI-SDPI అనుబంధంపై మరింత సమాచారం వెలుగులోకి రావొచ్చు. PFI నిషేధం తర్వాత కూడా, SDPI ద్వారా పిఎఫ్ఐ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు కేంద్రం ఆరోపిస్తోంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.