
బెంగళూరులో కురిసిన వర్షాల వల్ల కావేరి నది నుండి నగరానికి నీటిని ఎత్తిపోసే పంపింగ్ స్టేషన్ మునిగిపోవడంతో బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ పంపింగ్ స్టేషన్ మాండ్య ప్రాంతంలో ఉంది. బీడబ్లూఎస్ఎస్బీ పరిధిలో ఉండే ఈ పంపింగ్ స్టేషన్ ప్రతీ రోజు బెంగుళూరు సిటీకి రోజు లక్షల లీటర్ల నీటిని ఎత్తిపోసేది. కానీ అది ఇప్పుడు నీటిలో మునిగిపోయింది.
మనీష్ సిసోడియాకు తప్పించుకునే మార్గం లేదు.. స్టింగ్ ఆపరేషన్ వీడియో విడుదల చేసిన బీజేపీ
దీని ప్రభావం వల్ల ఇప్పటికే వర్షాలతో దెబ్బతిన్న బెంగళూరులోని దాదాపు 50 ప్రాంతాలకు రానున్న రెండు రోజుల పాటు తాగునీరు అందదు. కాగా సోమవారం మండ్యలోని టీకే హళ్లి నీటి సరఫరా యూనిట్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సందర్శించనున్నారు. ప్రస్తుతం పంపింగ్ స్టేషన్‌లో నిలిచిపోయి ఉన్న నీటిని అధికారులు బయటకు పంపుతున్నారు.
యంత్రాన్ని మళ్లీ పునరుద్దరించేందుకు టెక్నికల్ టీం కూడా ఆ స్పాట్ కు చేరుకుంది. బెంగళూరుకు కావేరి నదే ప్రధాన తాగునీటి వనరుగా ఉంది. కాబట్టి ఈ యూనిట్ చాలా కీలకంగా ఉంది. బెంగళూరులోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలో ఉన్నందున, రెండు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF) బృందాలను కూడా ప్రభావిత ప్రాంతాలకు మోహరించారు. గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలకు మొత్తం 30 ప్రాంతాలు దెబ్బతిన్నాయి.
బెంగళూరులో గత రాత్రిపూట కురిసిన వర్షాలకు ట్రాఫిక్ కు చాలా అంతరాయం కలిగించాయి. నగరంలోని అనేక సరస్సులు, మురికినీటి కాలువలు పొంగిపొర్లడంతో పలు లోతట్టు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. నీరు ఇళ్లలోకి ప్రవేశించి సాధారణ జీవితాన్ని ప్రభావితం చేసింది.
సర్జాపూర్ రోడ్‌లోని రెయిన్‌బో డ్రైవ్ లేఅవుట్, సన్నీ బ్రూక్స్ లే అవుట్ వంటి ప్రాంతాల్లో నీరు నిలిచిపోయాయి. దీంతో ఉదయం పూట విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లేందుకు ట్రాక్టర్లు, పడవలను ఉపయోగించుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్‌లోని వర్షాలు, వరదల కారణంగా కొన్ని ఐటీ కంపెనీలకు నష్టం వాటిల్లిందని నివేదికలు వెలువడ్డాయి.