Disha Salian case: కేంద్ర మంత్రి, ఆయన కుమారుడికి సమన్లు జారీ చేసిన పోలీసులు.. ఎందుకోసమంటే..

By Sumanth KanukulaFirst Published Mar 2, 2022, 10:23 AM IST
Highlights

కేంద్ర మంత్రి నారాయణ రాణే (Narayan Rane), ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే‌పై (Nitesh Rane)‌లకు మాల్వాని పోలీసులు సమన్లు జారీచేశారు. విచారణకు హాజరుకావాలని ఆ సమన్లలో పేర్కొన్నారు. 

కేంద్ర మంత్రి నారాయణ రాణేకు మహారాష్ట్ర పోలీసులు సమన్లు జారీ చేశారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput)  మాజీ మేనేజర్ దిశా సలియన్ (Disha Salian) తల్లిదండ్రుల దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు మాల్వాని పోలీసులు ఇటీవల కేంద్ర మంత్రి నారాయణ రాణే (Narayan Rane), ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే‌పై (Nitesh Rane) ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విచారణకు హాజరుకావాలని మల్వాని పోలీసులు.. నారాయణ్ రాణే, నితేష్ రాణేలకు సమన్లు జారీ చేశారు. నితీష్ రాణే.. మార్చి 3వ తేదీ ఉదయం 11 గంటలకు, నారాయణ్ రాణే మార్చి 4వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. 

సుశాంత్ మరణించడానికి కొద్ది రోజుల ముందు దిశా సలియన్ మృతిచెందారు. అయితే దిశా సాలియన్ సామూహిక అత్యాచారం, హత్యకు గురైనట్లు ఆరోపణలు చేసిన రాణే తమ మరణించిన కుమార్తె పరువు తీస్తున్నారని ఆమె తల్లి వాసంతి సతీష్ సలియన్ (52) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దిశా సాలియన్ తల్లిదండ్రులు మల్వానీ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే పోలీసులు నారాయణ్ రాణే, నితేష్ రాణే‌లపై Information Technology Act‌లోని సెక్షన్ 67తో పాటు భారతీయ శిక్షాస్మృతిలోని 211, 500, 504, 509, 506 (2) మరియు 34 సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

Latest Videos

‘రాణే వ్యాఖ్యలు మా కుమార్తె క్యారెక్టర్‌పై  ప్రశ్నను లేవనెత్తాయి. దిశకు సంబంధించిన రెండు ఒప్పందాలు రద్దు కావడం వల్ల నిరాశ, నిస్పృహలకు లోనయింది’ దిశా తల్లి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. పోలీసుల విచారణపై తాము సంతృప్తిగా ఉన్నామని, ఎవరిపైనా ఫిర్యాదులు లేవని ఆమె చెప్పారు. 

మరోవైపు ముంబై మేయర్ కిషోరీ పెడ్నేకర్ హారాష్ట్ర రాష్ట్ర మహిళా కమిషన్ (MSCW)కి ఫిర్యాదు చేసిన తర్వాత.. ఇద్దరు సభ్యులు మంగళవారం దిశా సలియన్ ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రుల వాంగ్మూలాలను నమోదు చేశారు. దిశా సలియన్ మృతి గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయాలని మహారాష్ట్ర రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలీ చకంకర్ పోలీసులను కోరారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 

click me!