
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ చీఫ్, ప్రస్తుత బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ వ్యాఖ్యలపై పార్టీ అధినాయకత్వం అసహనాన్ని వ్యక్తపరిచింది. మళ్లీ ఇలాంటివి రిపీట్ చేయవద్దని హెచ్చరించింది. ఈ మేరకు ఓ వార్నింగ్ లెటర్ బీజేపీ హెడ్ క్వార్టర్ నుంచి ఆయనకు వెళ్లింది. దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలతో పార్టీ కేంద్ర నాయకత్వం ఇబ్బంది పడిందని ఆ లేఖ పేర్కొంది.
ఏప్రిల్ నెలలో దిలీప్ ఘోష్ ఆయన తర్వాత పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న సుకాంత మజుందార్‌పై విమర్శలు చేశారు. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను సమర్థంగా నిర్వహించలేకపోతున్నారని ఆయన సుకాంత మజుందార్‌పై ఆరోపణలు చేశారు. సుకాంత మజుందార్‌కు ఎక్కువ అనుభవం లేదని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో చాలా మంది బీజేపీ సీనియర్ నేతలు ఉన్నారని వివరించారు. వారికి పార్టీ పగ్గాలు అప్పజెప్పితే ఇంకా బాగుంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ హెడ్ క్వార్టర్ ఇంచార్జీ అరున్ సింగ్ ఓ వార్నింగ్ లెటర్ దిలీప్ ఘోష్‌కు పంపారు.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో దిలీప్ ఘోష్ నోరు పారేసుకున్నాడని, ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర సీనియర్ నేతలు, కేంద్ర నాయకత్వానికి ఇబ్బందికరంగా మారాయని ఆ లేఖలో బీజేపీ పేర్కొంది. అలాంటి వ్యాఖ్యలు పార్టీకే నష్టాన్ని చేకూరుస్తాయని వివరించింది. అంతేకాదు, ఇన్నాళ్లు దిలీప్ ఘోష్ చేసిన హార్డ్ వర్క్‌ను కూడా నీరుగారుస్తుందని పేర్కొంది.
దిలీప్ ఘోష్ పార్టీ కోసం ఎంతో శ్రమించాడని, అందులో సందేహమేమీ లేదని బీజేపీ ఆ లేఖలో వివరించింది. అయితే, ఆయన కొన్నిసార్లు తనను తాను తమాయించుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపింది. అలాంటి వ్యాఖ్యలు బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయని వివరించింది. గతంలోనూ దిలీప్ ఘోష్‌కు ఇలాంటి వార్నింగ్‌లు ఇచ్చినట్టు పేర్కొంది. కానీ, ఆ హెచ్చరికలను దిలీప్ ఘోష్ చెవికి ఎక్కించుకోలేదని అర్థం అవుతున్నదని తెలిపింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనల మేరకు ఈ లేఖ దిలీప్ ఘోష్‌కు పంపినట్టు అరుణ్ సింగ్ వివరించారు. కాబట్టి, దిలీప్ ఘోష్ మీడియాతో, ముఖ్యంగా ప్రజా సంబంధ వ్యవహారాల్లో ఆచితూచి, విచక్షణతో వ్యవహరించాలని సూచించారు.