దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. పెరిగిన చలి తీవ్రత.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు

By Sumanth KanukulaFirst Published Dec 21, 2022, 12:20 PM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీని బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. మరోవైపు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత కూడా పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీని బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత కూడా పెరిగింది. ఈ కారణంగా ఢిల్లీలో ఉదయం దృశ్యమానత కేవలం 50 మీటర్లకు తగ్గింది. దీంతో రోడ్లపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. మరోవైపు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  దాదాపు 18 రైళ్లు గంటన్నర నుంచి ఐదు గంటల వరకు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. 

హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్‌లలో రాబోయే నాలుగు-ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మంగళవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగా 23.2 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా 6.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

‘‘ఇన్సాట్ 3డి రాపిడ్ శాటిలైట్ ఇమేజ్.. పంజాబ్, వాయువ్య రాజస్థాన్ నుంచి హర్యానా మీదుగా తూర్పు యుపి వరకు దట్టమైన పొగమంచు కొనసాగింపును చూపుతుంది’’అని భారత వాతావరణ శాఖ (IMD) ట్వీట్ చేసింది.

click me!