Supreme Court: కూల్చివేత చట్టం ప్రకారం జరగాలి.. యూపీ బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు

By Mahesh RajamoniFirst Published Jun 16, 2022, 1:44 PM IST
Highlights

UP bulldozer action: నిర్మాణాల‌ కూల్చివేత చట్టం ప్రకారం జరగాల‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే, బుల్డోజర్లను ఉపయోగించి కూల్చివేతలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్‌ను మూడు రోజుల్లో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 

Uttar Pradesh-Demolition:  దేశంలో గ‌త కొన్ని రోజులుగా బుల్డోజ‌ర్ల చ‌ర్య‌లు వివాదాస్ప‌దంగా మారుతున్నాయి. ఒక వ‌ర్గాన్ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా చేసుకుని ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. రాజ‌కీయంగా ఈ అంశం పెను దుమారం రేపుతోంది. ఈ క్ర‌మంలోనే బుల్డోజ‌ర్ల‌ను  ఉపయోగించి నిర్మాణాల కూల్చివేతలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మూడు రోజుల్లో అఫిడవిట్‌ను సమర్పించాలని సుప్రీంకోర్టు కోరింది. ప్రభుత్వం ఫలానా వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని అందులోని సభ్యుల ఆస్తులను బుల్డోజ‌ర్ల‌తో కూల్చివేస్తున్న‌ద‌ని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని పిటిషనర్లు ఆరోపించారు.

ఉత్తరప్రదేశ్ అధికారులకు తగిన ప్రక్రియను అనుసరించకుండా రాష్ట్రంలో తదుపరి ఆస్తుల కూల్చివేతలను నిర్వహించకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జమియత్-ఉలమా-ఐ-హింద్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. కూల్చివేత సమయంలో ఎటువంటి చట్టాన్ని ఉల్లంఘించలేదని ప్రభుత్వం ప్ర‌భుత్వం పేర్కొంది. అలాగే, బుల్డోజర్లను నడపడానికి ముందు నోటీసులు అందించలేదనే ఆరోపణను కొట్టిపారేసింది. అన్ని చర్యలను ఆపమని కోరడం లేదని  సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేస్తూనే.. అటువంటి చర్యలన్నీ చట్టం పరిధిలో ఉండాలి నొక్కి చెప్పింది. 

"ప్రభుత్వానికి తన అభ్యంతరాలను దాఖలు చేయడానికి సమయం లభిస్తుంది. ఈలోగా మేము వారి [పిటిషనర్ల] భద్రతను నిర్ధారించాలి. వారు కూడా సమాజంలో భాగమే. ఎవరికైనా ఫిర్యాదు వచ్చినప్పుడు, దానిని పరిష్కరించే హక్కు వారికి ఉంటుంది. అలాంటి కూల్చివేతలు చట్టం ప్రకారం మాత్రమే జరుగుతుంది. మేము వచ్చే వారం కేసును విచారిస్తాము”అని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా, హంగీర్‌పురిలో ఏ వర్గానికి చెందిన ఆస్తి ఉందో చూడకుండానే నిర్మాణాలను తొలగించారని సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఇటువంటి చర్యలు సరైన ప్రక్రియతో కొనసాగుతున్నాయి మరియు తాజా కూల్చివేత అదే ఉదాహరణ అని పేర్క‌న్నారు. ఇక ప్రభుత్వ అఫిడవిట్‌లో పంపిన నోటీసులు మరియు తీసుకున్న చర్యల వివరాలను కలిగి ఉండాల‌ని కోర్టు పేర్కొంది. జూన్ 21న ఈ అంశంపై మళ్లీ విచారణ జరగనుంది. 

కాగా, జమియత్-ఉలమా-ఐ-హింద్ అనే ముస్లిం సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. గత వారం ఘర్షణల్లో పాల్గొన్న నిందితుల అక్రమంగా నిర్మించిన నివాసాలను కూల్చేయాని యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఆదేశాలకు సంబంధించి ఈ పిటిషన్ వేసింది. ఘర్షణల వెనుక మాస్టర్ మైండ్ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నేత జావేద్ మహమ్మద్ ఉన్నాడని,  ఆయనకు చెందిన రెండు అంతస్తుల బంగ్లాను ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆదివారం కూల్చేసిన సంగతి తెలిసిందే. ఈ బిల్డింగ్ అక్రమంగా నిర్మించారని, ఇందుకు సంబంధించి నోటీసులు పంపినా మే నెలలో జావేద్ మహమ్మద్ విచారణకు హాజరుకాలేదని అధికారులు పేర్కొన్నారు. కానీ, జావేద్ మహమ్మద్ న్యాయవాది మాత్రం ఆ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. తమకు నోటీసులు అంతకు ఒకట్రెండు రోజుల ముందే అందిందని అన్నారు. అంతేకాదు, అసలు ఆ ఇల్లు జావేద్ మహమ్మద్ పేరిట లేదని, ఆయన భార్య పేరు మీద ఉన్నదని వివరించారు. ఈ నెల 3న నిజామ్ ఖురేషికి సన్నిహితుడైన వ్యక్తి ఇంటినీ కాన్పూర్‌లో కూల్చేసిన సంగతి తెలిసిందే.

click me!