ఢిల్లీ లిక్కర్ స్కామ్‌: దేశంలో 35 చోట్ల కొనసాగుతున్న ఈడీ సోదాలు..

By Sumanth KanukulaFirst Published Sep 6, 2022, 12:34 PM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఢిల్లీతో పాటు, దేశంలోని 35 ఇతర ప్రదేశాల్లో సోదాలు చేపట్టారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఢిల్లీతో పాటు, దేశంలోని 35 ఇతర ప్రదేశాల్లో సోదాలు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రుడికి చెందిన ఢిల్లీలోని ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని ఇతర ప్రాంతాలతో పాటు గురుగ్రామ్, లక్నో, హైదరాబాద్, ముంబై, బెంగళూరులో కూడా ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కేసు నమోదు చేయగా.. అందులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు పలువురిని నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు ఈడీ అధికారుల బృందం.. మనీష్ సిసోడియా నివాసాన్ని గానీ, కార్యాలయంలో సోదాలు జరపడం లేదని ఆప్ వర్గాలు తెలిపాయి. 

ఈడీ సోదాలపై మనీష్ సిసోడియా స్పందిస్తూ.. ‘‘మొదట సీబీఐ దాడులు నిర్వహించి ఏమీ కనుగొనలేదు. ఇప్పుడు ఈడీ దాడులు చేస్తోంది. వారు కూడా ఏమీ కనుగొనలేరు. ఇది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న మంచి పనిని ఆపడానికి చేసిన ప్రయత్నం. వారు సీబీఐ, ఈడీని ఉపయోగించుకోనివ్వండి.. కానీ మా పనిని ఆపలేరు’’ అని చెప్పారు. తనకు ఎటువంటి సమాచారం లేదని, వాళ్ళు వచ్చినా పాఠశాలల బ్లూప్రింట్లు మాత్రమే వారికి దొరుకుతాయని చెప్పారు. 


ఇక, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 రూపకల్పన, అమలులో అక్రమాలు జరిగినట్లు సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తర్వాత.. మనీష్ సిసోడియా ఢిల్లీ నివాసం, ఐఎఎస్ అధికారి, ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీ కృష్ణ మరియు ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 19 ఇతర ప్రదేశాలలో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఎక్సైజ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న మనీష్ సిసోడియా, మాజీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీ కృష్ణ, మాజీ డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ఆనంద్ కుమార్ తివారీ, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ పంకజ్ భట్నాగర్, తొమ్మిది మంది వ్యాపారవేత్తలు, రెండు కంపెనీలను సీబీఐ ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేర్కొంది.
 

click me!