
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ హాస్పిటల్ సరిదిద్దుకోలేని తప్పు చేసింది. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ (ఐవీఎఫ్)లో భాగంగా ఓ మహిళకు ఆమె భర్తకు చెందిన వీర్య కణాలను ఎక్కించకుండా.. గుర్తు తెలియని వీర్యదాతకు చెందిన స్పెర్మ్‌ను ఇంజెక్ట్ చేశారు. ఈ విషయం ఆ మహిళ ఇద్దరు కవల పిల్లలను ప్రసవించిన తర్వాత తెలిసింది.
ఈ ఘటన 2008-2009లలో జరగింది. పశ్చిమ ఢిల్లీలోని ఓ హాస్పిటల్ ఆమెకు వీర్యకణాలను ఇంజెక్ట్ చేయించి కన్సీవ్ అయ్యేలా చేసింది. అయితే, ఆమె కవల పిల్లలను కన్న తర్వాత గానీ ఈ విషయం తెలిసిరాలేదు. పిల్లలను ప్రసవించిన తర్వాత డీఎన్ఏ ప్రొఫైల్ టెస్టు చేయించారు. ఆ ఇద్దరు కవల పిల్లల బ్లడ్ గ్రూప్ AB+ ఉన్నది. కాగా, ఆ భార్య, భర్తల బ్లడ్ గ్రూప్స్ మాత్రం B+, O-.
ఆ మహిళకు స్పెర్మ్ ఇంజెక్ట్ చేయడంలో నిర్లక్ష్యాన్ని ఈ రిపోర్టు వెల్లడించింది.
ఈ విషయం తెలిసిన తర్వాత దంపతులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. అనంతరం, ఆమె భర్త కన్జూమర్ ఫోరమ్‌లో ఫిర్యాదు చేశాడు. హాస్పిటల్ నుంచి తనకు రూ. 2 కోట్ల పరిహారం అందించాలని డిమాండ్ చేశాడు. ఈ పొరపాటు కారణంగా తన కుటుంబం మానసిక క్షోభ అనుభవించిందని, జెనెటిక్ సమస్యలనూ ఎదుర్కొందని వివరించాడు.
Also Read: పెళ్లి చేసుకున్న రోజే వధువుకు కడుపు నొప్పి.. మరుసటి రోజే ప్రసవం.. షాక్‌లో వరుడు.. ఎలా కవర్ చేశారంటే?
దాదాపు 15 ఏళ్ల పాటు ఈ కేసు నేషనల్ కన్జూమర్ డిస్ప్యూట్స్ రెడ్రస్సల్ కమిషన్(ఎన్‌సీడీఆర్‌సీ)లో పెండింగ్‌లో ఉన్నది. గురువారం న్యాయమూర్తి దీనిపై తీర్పు ఇచ్చారు. భాటియా గ్లోబల్ హాస్పిటల్ అండ్ ఎండోసర్జరీ ఇన్‌స్టిట్యూట్, దాని చైర్మన్, దాని డైరెక్టర్‌లు అంతా కలిసి రూ. 1 కోటి బాధిత కుటుంబానికి పరిహారంగా ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. జరిమానా చెల్లించడానికి ఆరు వారాల గడువు ఇచ్చింది. ఈ కాలంలో ఫైన్ చెల్లించకుంటే ఏడాదికి 8 శాతం చొప్పున వడ్డీ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
అంతేకాదు, ఆ ఇద్దరు పిల్లల పేరిట రూ. 1.5 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఎన్‌సీడీఆర్‌సీకి చెందిన కన్జూమర్ రిలీఫ్ ఫండ్‌లో రూ. 20 లక్షలు జమ చేయాలని, వీటికి తోడు హాస్పిటల్ డైరెక్టర్లు సహా ముగ్గురూ.. ఫిర్యాదిదారులకు రూ. 10 లక్షల చొప్పున డబ్బులు ఇవ్వాలని ఆదేశించింది. 15 ఏళ్ల తర్వాత ఈ తీర్పు వచ్చింది.