
న్యూఢిల్లీ:ఆదిపురుష్ సినిమా యూనిట్ కు ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు నోటీసులు జారీ చేసింది. ఓ వర్గం మనోభావాలు గాయపర్చారని దాఖలైన పిల్ పై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సినిమా యూనిట్ తో పాటు హీరో ప్రభాస్ కు కూడా నోటీసులు జారీ చేశారు.
ఆదిపురుష్ టీజర్ ను చిత్ర యూనిట్ ఇటీవలనే విడుదల చేసింది.అయితే ఈ టీజర్ ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.ఈ విషయమై చిత్ర యూనిట్ పై ట్రోల్స్ చేశారు. దర్శకుడిపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఓ వర్గం దేవుళ్లను తప్పుగా టీజర్ లో చూపారని న్యాయవాది రాజ్ గౌరవ్ పిటిషన్ దాఖలు చేశారు. టీజర్ లో ఓ వర్గం దేవుళ్లను అసమంజసమైన సరికాని విధంగా చిత్రీకరించారని ఆ పిటిషన్ లో గౌరవ్ చెప్పారు.
రాముడిని క్రూరమైన ప్రతీకార రూపంగా చూపారని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. సాంప్రదాయ చిత్రపటానికి విరుద్దంగా రాముడిని చూపారన్నారు. రావణుడి పాత్ర చాలా భయంకరంగా ఉందని పిటిషనర్ ఆరోపించారు. ఈ సినిమాపై నిషేధం విధించాలని కూడా పిటిషనర్ కోరారు. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ఈసినిమా విడుదల చేయాలని సినిమా యూనిట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సినిమాను విడుదల చేయకుండా పూర్తిగా నిషేధించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు ఆది పురుష్ సినిమా యూనిట్ కు నోటీసులు జారీ చేసింది.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కు భూషన్ కుమార్, ఒం ప్రసాద్, సుతార్, రాజేష్ నాయర్ లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ,తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.