
న్యూఢిల్లీ: సైనిక దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ స్కీమ్ పై దాఖలైన పలు పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు ఈ రోజు కొట్టేసింది. ఈ స్కీమ్ దేశ ప్రయోజనాలను ఉద్దేశించి తెచ్చారని, సాయుధ బలగాలను మరింత బలోపేతం చేయడానికి ఉద్దేశించిందనని వివరించింది. గతేడాది జూన్‌లలో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్ ప్రకటించింది. 17న్నర, 21 ఏళ్ల మధ్య వయస్కులు ఈ స్కీమ్ కింద సైన్యంలో చేరడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా నియామకమైన వారు నాలుగేళ్లు అందులో సేవలు అందిస్తారు. ఆ తర్వాత అందులో నుంచి 25 శాతం మందికి రెగ్యులర్ సర్వీస్‌ను మంజూరు చేస్తారు. ఈ స్కీమ్ ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వచ్చాయి.
ఈ అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌ల ధర్మాసనం విచారించింది. ఈ స్కీమ్ దేశ ప్రయోజనాల కోసం రూపొందించిందని ఈ ధర్మాసనం తెలిపింది. అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌లో జోక్యం చేసుకోవడానికి తమకు సరైన కారణం కూడా కనిపించడం లేదని వివరించింది.
Also Read: సిద్ధూ మూసేవాలా మర్డర్ నిందితులు ఇద్దరు జైలులో హతం.. పంజాబ్ జైలులో ఫైట్
ఈ స్కీమ్ కింద ఇప్పటికే విడుదలైన పలు నోటిఫికేషన్లు, అడ్వర్టయిజ్‌మెంట్లనూ సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లనూ ఈ సందర్భంగా హైకోర్టు డిస్మిస్ చేసింది.