Deepotsav: 22 లక్షలకు పైగా దీపాల‌తో అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం..

By Mahesh Rajamoni  |  First Published Nov 12, 2023, 12:29 AM IST

Deepotsav 2023: అయోధ్య‌లో దీపోత్స‌వం అంగరంగ వైభవంగా జ‌రిగింది. సరయూ నది ఒడ్డున‌ 51 ఘాట్లలో 22 లక్షలకు పైగా సంప్రదాయ మట్టి దీపాలు లేదా సాధార‌ణ‌ దీపాలను ఒకేసారి వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ జన్మభూమి మార్గాన్ని కూడా దీపోత్సవం కోసం వివిధ రకాల పూలతో అలంకరిస్తున్నారు.


Ayodhya Deepotsav 2023: దీపావళి ఉత్స‌వాల‌లో భాగంగా అయోధ్యలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏడవ దీపోత్సవ వేడుక‌ల‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వహించింది. శ్రీరాముడి జీవితాన్ని వర్ణించే 18 దివ్య టాబ్లెట్లతో కూడిన ఘనమైన దీపోత్సవ ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయ స్క్వేర్ నుంచి ప్రారంభమై రామ్ కథా పార్కు వద్ద ముగిసే ఈ ఊరేగింపులో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు భక్తి భావాలను ప్రదర్శించారు. ఈ ఉత్స‌వాల నేప‌థ్యంలో నిర్మాణంలో ఉన్న రామాలయాన్ని అలంకరించారు.  రామజన్మభూమి వద్ద భక్తులు గుమిగూడి శ్రీరాముడికి పూజలు చేశారు.  పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ ఈ ఊరేగింపును జెండా ఊపి ప్రారంభించారు. 

దీపోత్స‌వం వేడుక‌ల‌లో భాగంగా సరయూ నదిలోని 51 ఘాట్ల వద్ద ఒకేసారి 22 లక్షలకు పైగా సంప్రదాయ దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ వేడుకలో శ్రీరామ జన్మభూమి మార్గాన్ని వివిధ పూలతో అలంకరించారు. 25,000 మందికి పైగా వాలంటీర్లను సమీకరించి ఒకేసారి దీపాలు వెలిగించిన ఈ కార్య‌క్ర‌మాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బృందం పర్యవేక్షించింది. ఈ సందర్భంగా ఆదిత్యనాథ్ మాట్లాడుతూ గత ఏడేళ్లలో దీపోత్సవ్ స్థానిక వేడుక నుంచి గణనీయమైన జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమంగా రూపాంతరం చెందిందని గుర్తు చేశారు. రామరాజ్య స్థాపనకు రామమందిర నిర్మాణం మూలస్తంభమనీ, 2014 లోక్ సభ ఎన్నికల నుంచే ప్రధాని నరేంద్ర మోడీ దీనికి పునాది వేశారని గుర్తు చేశారు.

Latest Videos

ఐక్యతకు చిహ్నంగా జార్ఖండ్ లోని పాకూర్ జిల్లాకు చెందిన గిరిజనులతో పాటు వివిధ ప్రాంతాల ప్రజలు ఘనంగా జరిగిన దీపోత్సవానికి హాజరయ్యారు. జార్ఖండ్ ప్రదేశ్ శ్రీరాం జానకి చారిటబుల్ సర్వీస్ ట్రస్ట్ పంపిన 48 మంది గిరిజనుల బృందం ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చింది. 14 ఏళ్ల వనవాసం తర్వాత అయోధ్యకు రాముడు తిరిగి రావడానికి గుర్తుగా రథాన్ని లాగే కార్య‌క్ర‌మంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ లు పాల్గొన్నారు. భారతదేశంలో 'రామరాజ్యం' స్థాపనలో రామాలయం ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ముఖ్యమంత్రి శ్రీరాముడికి ప్రతీకాత్మక పట్టాభిషేకాన్ని నిర్వహించారు.

కాగా, 2017లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా అయోధ్యలో దీపోత్స‌వ మహోత్సవాన్ని ప్రారంభించి ప్రారంభించారు. దీనిని 51 వేల దీపాలు వెలిగించ‌డంతో మొద‌లుపెట్టారు. ఆ త‌ర్వాత 2022లో అయోధ్యలోని రామ్‌కీ పౌరిలో 15.76 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. గతేడాది ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సారి గ‌త రికార్డుల‌ను తిర‌గ‌రాస్తూ ఏకంగా 22 ల‌క్ష‌ల దీపాల‌ను ఒకే సారి వెలిగించి దీపోత్స‌వం నిర్వ‌హించారు.

click me!