Vikas Mahante : ప్రధాని నరేంద్ర మోడీ మాదిరిగే కనిపించే వ్యక్తి పలువురు మహిళలతో కలిసి గర్భా అడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ అందులో ఉన్నది ప్రధానే అని అనుకున్నారు. కానీ అది డీప్ ఫేక్ టెక్నాలజీతో తయారు చేశారని ప్రధాని గతవారం స్పష్టం చేశారు. అయితే అది డీప్ ఫేక్ వీడియో కాదని, నిజమైనదే అని ఓ వ్యక్తి ముందుకొచ్చారు. ఇంతకీ ఆయన ఎవరంటే ?
Vikas Mahante : ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి సృష్టిస్తున్న డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోల వల్ల ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు వీటి వల్ల బాధపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా గత వారం ఈ డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోల వల్ల కలిగే ప్రమాదాల గురించి దేశాన్నిహెచ్చరించారు.
ఆయన కొంతమంది మహిళల బృందంతో గర్బా ఆడుతున్నట్టుగా ఉన్న వీడియోను ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యింది. దీంతో ఆయన స్పందించారు. నిజానికి తాను స్కూల్ ను విడిచిపెట్టినప్పటి నుండి గర్బా ఆడలేదని చెప్పారు. తాను కూడా డీప్ ఫేక్ వీడియోలకు బాధితుడిని అని ఢిల్లీలో మీడియాతో చెప్పారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి అలా చేశారని తెలిపారు.
అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పింది నిజమే అని తేలింది. అందులో ఉన్న ప్రధాని కాదు.. వైరల్ అయిన వీడియోలో ఉన్నది ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త. మలాడ్ లో స్టీల్ ప్యాకేజింగ్ వ్యాపారాన్ని నడుపుతున్న వికాస్ మహంతే ఆ వీడియోలో గర్భా అడింది. ప్రజా జీవితంలో నరేంద్ర మోడీ ఎదుగుదలతో ఆయన వ్యక్తిగత జీవితం కూడా మలుపు తిరిగింది. మహంతే దాదాపు ప్రధాన మంత్రిలాగే కనిపిస్తారు.
ప్రధాని కంటే పదేళ్లు చిన్నవాడైన మహంతే.. సోమవారం ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఆయన చేసిన తప్పును వివరించారు. దేశవిదేశాల్లో జరిగే కార్యక్రమాలకు తనను తరచూ ఆహ్వానిస్తుంటారని, అక్కడ ప్రధాని మోడీ ఆలోచనలు తెలియజేసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. వైరల్ అయిన వీడియో డీప్ ఫేక్ కాదని, ఆ వీడియోలో ఉన్నది తానేనని స్పష్టం చేశారు. తాను ఓ వ్యాపారవేత్తనని, కళాకారుడినని చెప్పారు.
2013లో గాంధీనగర్ లో తాను ప్రధాని నరేంద్ర మోడీని ఒక్క సారి మాత్రమే కలిశానని మహంతే చెప్పారు. గుజరాత్ ఎమ్మెల్యే రమణ్ భాయ్ పాట్కర్ తనను ప్రధానికి పరిచయం చేశారని, తాము ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నామని, కానీ ఆయనతో ఫొటో దిగేందుకు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. 2014 నుంచి బీజేపీ సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తున్నానని, ఎంపీ అరవింద్ సావంత్, గజానన్ కీర్తికర్, పూనమ్ మహాజన్, రాహుల్ షెవాలే, గోపాల్ శెట్టి, చింతమన్ వంగా సహా పలువురి తరఫున ప్రచారం చేశానని చెప్పారు. అభ్యర్థులు రోడ్ షోలకు వెళ్లినప్పుడు వారితో కలిసి ట్రక్కుపై నిలబడటం, అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రసంగాలు చేయడం తన పని అని చెప్పారు.