ముంబైలో మరో కరోనా మరణం: దేశంలో 10కి చేరిన మృతుల సంఖ్య

By telugu teamFirst Published Mar 24, 2020, 1:53 PM IST
Highlights

తాజాగా మంగళవారంనాడు దేశంలో మరో కరోనా మరణం సంభవించింది. ముంబైలోని కస్బూర్బా ఆస్పత్రిలో చికిత్స పొందుతు 65 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 10కి చేరుకుంది.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మృతుల సంఖ్య 10కి చేరుకుంది. తాజాగా మంగళవారంనాడు మహారాష్ట్ర రాజధాని ముంబైలో 65 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. సోమవారంనాడు ముంబైలోని కస్బూర్బా ఆస్పత్రిలో చేరిన అతను మంగళవారం మృత్యువాత పడ్డాడు. ఆస్పత్రిలో చేరిన కొద్ది గంటలకే అతను తుదిశ్వాస విడిచాడు. 

మృతుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి మార్చి 15వ తేదీన అహ్మదాబాద్ వచ్చాడు. అక్కడి నుంచి 20వ తేదీన ముంబై చేరుకున్నాడు. దగ్గు, జ్వరం రావడంతో సోమవారం ఆస్పత్రిలో చేరాడు. 

భారతదేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కేసుల సంఖ్య 500కు చేరువలో ఉంది. మంగళవారం ఉదయానికి భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 492కు చేరుకుంది. అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. మణిపూర్ లో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. 

మిజోరం, మణిపూర్ మినహా రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ ప్రకటించాయి. దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య పదికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఆంక్షలు అమలవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. రోడ్ల మీదికి వచ్చేవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది...

మహారాష్ట్ర 84, మరణాలు 3
ఆంధ్రప్రదేశ్ 7
కర్ణాటక 37, మరణాలు 1
మణిపూర్ తొలి కరోనా కేసు
తమిళనాడు 12
తెలంగాణ 33
బీహార్ 2, మరణాలు 1
రాజస్తాన్ 26
పంజాబ్ 21, మరణాలు 1
పశ్చిమ బెంగాల్ 7 మరణాలు 1
ఉత్తరప్రదేశ్ 33
చత్తీస్ గడ్ 1
హర్యానా 12
హిమాచల్ ప్రదేశ్ 3, మరణాలు 1
మధ్యప్రదేశ్ 7
ఒడిశా 2
లడక్ 3
ఉత్తరాఖండ్ 3
కేరళ 87
గుజరాత్ 29, మరణాలు 1
ఢిల్లీ 30 మరణాలు 1

దేశంలోని 30 రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది. మొత్తం 548 జిల్లాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా ల్లో పాక్షికంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈ రాష్ట్రాల్లోని 80 జిల్లాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది. సోమవారంనాడు ఒక్క రోజే 75 తాజా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యయ్యాయి.  వారిలో 41 మంది విదేశీయులు.  

గుజరాత్, బీహార్, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మరణాలు సంభవించాయి. 

click me!