
Police station set afire in Bengal's North Dinajpur: పశ్చిమ బెంగాల్ లో ఒక మైనర్ బాలిక మృతదేహం లభ్యమైనప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బాలిక మృతదేహం తరలించిన తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అలాగే, శవపరీక్షపై పోలీసులు తప్పుడు సమాచారం అందిస్తున్నారని స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే పోలీసు స్టేషన్ కు నిప్పు పెట్టారు.
వివరాల్లోకెళ్తే.. కాలియాగంజ్ లో మైనర్ మృతిపై బెంగాల్ లోని ఉత్తర దినాజ్ పూర్ లో చెలరేగిన అల్లర్ల మధ్య కాలియాగంజ్ పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టారు. గిరిజన, కమ్తాపురి సంఘాలు మంగళవారం కాలియాగంజ్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించాయి. స్టేషన్ ను ఆనుకుని ఉన్న పోలీస్ క్వార్టర్స్ తో పాటు పలు పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో వారు లాఠీచార్జి చేశారు. మైనర్ బాలిక మృతదేహం లభ్యమైనప్పటి నుంచి కాలియాగంజ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహాన్ని పడేసే ముందు బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, శవపరీక్ష నివేదికలో అత్యాచారం నిర్ధారణ కాలేదని పోలీసులు తెలిపారు. ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, బాలిక విషం తాగి ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు.
ఈ అంశంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ విమర్శల దాడిని పెంచింది. ఉత్తర దినాజ్ పూర్ లోని రాయ్ గంజ్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు బీజేపీ ఎంపీ దేబోశ్రీ చౌదరి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కామ్తాపురి సంస్థల పిలుపునకు హాజరైన వారితో ఆందోళనకారులు ఘర్షణకు దిగారు. హింసను అణచివేసేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించి, ప్రజలపై లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.