
బిపర్‌జోయ్ తుపాన్ గుజరాత్‌లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. అయితే గురువారం రాత్రి బిపర్‌జోయ్ తుపాను కచ్ జిల్లాలో తీరం దాటగా.. ప్రస్తుతం బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యంత తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపాన్‌గా బలహీనపడింది. ప్రస్తుతం తూర్పు-ఈశాన్య దిశగా (రాజస్తాన్ వైపు) కదులుతున్న బిపర్‌జోయ్ తుపాన్ ప్రస్తుతం గుజరాత్‌లోని భుజ్‌కు 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రభావంతో నేడు, రేపు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
బిపర్‌జోయ్ తుపాన్ వాయువ్య దిశగా కదులుతున్నందున దక్షిణ రాజస్తాన్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. జూన్ 16, 17 తేదీల్లో రాజస్థాన్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. ఇక, అధిక వేగంతో వీస్తున్న గాలులు, అలలు, భారీ వర్షాల కారణంగా తాత్కాలిక గృహ నిర్మాణాలకు భారీ నష్టం జరగడంతోపాటు చెట్లు, కొమ్మలు కూలిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
ఇక, బిపర్‌జోయ్ తుపాను గురువారం గుజరాత్‌లో విధ్వంసం సృష్టించడంతో ఇద్దరు వ్యక్తులు (వరదల కారణంగా లోయలో చిక్కుకున్న మేకలను కాపాడేందుకు వెళ్లిన తండ్రీకొడుకులు) మరణించారు. 22 మంది గాయపడ్డారు, చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. భారీ వర్షాలు, గాలులకు అనేక వాహనాలు, ఇళ్ళు దెబ్బతిన్నాయి. సహాయచర్యల్లో 18 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్, 115 రోడ్లు భవనాల శాఖ బృందాలు, 397 విద్యుత్ శాఖ బృందాలు పాల్గొంటున్నాయి.
గుజరాత్‌లో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ, రహదారులపై కూలిన చెట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. జామ్‌నగర్ ఎయిర్‌పోర్టులో విమానయాన సేవలను నిలిపివేశారు. రైల్వే శాఖ కూడా పలు రైలు సర్వీసులను రద్దు చేసింది. ప్రస్తుతం బిపర్‌జోయ్ తుపాన్ రాజస్థాన్ దిశగా కదులుతుంది. ఈ సాయంత్రం రాజస్తాన్‌లో ప్రవేశించిన తర్వాత తుపాన్ మరింతగా బలహీనపడే అవకాశం ఉంది.