
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ముందుగా తీవ్ర అల్పపీడనంగా మారి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆదివారం రాత్రి తెలియజేసింది. అసని (Asani) గా నామకరణం చేసిన ఈ తుఫాను అండమాన్ దీవుల వెంట మయన్మార్, దక్షిణ బంగ్లాదేశ్ తీరం వైపు కదులుతుందని అంచనా వేసింది.
అసని తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో అండమాన్, నికోబార్ దీవుల అడ్మినిస్ట్రేషన్ రక్షణ చర్యలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలుపెట్టింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ ప్రాంతంలో బలమైన గాలులు తాకడం ప్రారంభించాయి.
అసని తుపాను అండమాన్ దీవుల వెంట మయన్మార్ (Myanmar), దక్షిణ బంగ్లాదేశ్ ( south Bangladesh) తీరం వైపు కదులుతుందని అంచనా వేస్తున్నట్లు IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర (Mrutyunjay Mohapatra) తెలిపారు. అండమాన్ దీవుల్లో తుపాను తీరం దాటదని ఆయన స్పష్టం చేశారు. ఈ తుఫాను ప్రభావం వల్ల పోర్ట్ బ్లెయిర్‌తో సహా ఉత్తర, మధ్య అండమాన్, దక్షిణ అండమాన్ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పాటు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి.
తుఫాను వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి అండమాన్, నికోబార్ దీవుల అడ్మినిస్ట్రేషన్ యుద్ధ ప్రాతిపదికన అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం అసని తుఫాను కారణంగా ద్వీప సమూహంలో భారీ వర్షం, బలమైన గాలులు వీయడంతో అండమాన్, నికోబార్ దీవుల తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
రక్షణ చర్యల కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF)కి చెందిన 150 మంది సిబ్బందిని మోహరించారు. దీవులలోని వివిధ ప్రాంతాల్లో ఆరు సహాయ శిబిరాలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. పోర్ట్ బ్లెయిర్‌లో మొత్తం 68 మంది, దిగ్లీపూర్, రంగత్, హుత్‌బే ప్రాంతాల్లో 25 మంది చొప్పున ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని మోహరించినట్లు విపత్తు నిర్వహణ కార్యదర్శి పంకజ్ కుమార్ తెలిపారు.
లోకల్ అడ్మినిస్ట్రేటివ్ ఇంటర్-షిప్పింగ్ సర్వీసెస్ తో పాటు చెన్నై(Chennai), విశాఖపట్నం (Visakhapatnam) లో ఉన్న సర్వీసెస్ లను కూడా నిలిపివేసింది. ఈ ఏడాదిలో వచ్చి తొలి తుఫాను తీరానికి సమీపంలో ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు.