
Uttar Pradesh: ‘మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు’ అన్న సినీ కవి అందె శ్రీ మాటలు అక్షర సత్యాలు అవుతున్నాయి. ప్రభుత్వాలు చిన్నారుల, మహిళల సంరక్షణ కోసం నిర్భయ లాంటి కఠిన చట్టాలు తీసుకవచ్చినా.. దేశంలో నానాటికీ చిన్నారులు, ఆడవారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. నిత్యమూ ఎదొక చోట మహిళలు, బాలికలపై దారుణాలు జరుగుతునే ఉన్నాయి. ఏ మాత్రం ఆదమరిచినా.. మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. అత్యాచారాలకు తెగబడుతున్నారు. తాజాగా.. నిత్యం జన సంచారం ఉంటే.. రైల్వే స్టేషన్ సమీపంలోని పబ్లిక్ టాయిలెట్‌లో ఒక యువతిపై లైంగిక దాడికి జరిగింది. ఈ దారుణం ఉత్తర ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ రైల్వే స్టేషన్ లో జరిగింది.
వివరాల్లోకెళ్తే.. గద్వారా ప్రాంతానికి చెందిన 20 ఏండ్ల వివాహిత అహ్మదాబాద్ వెళ్లేందుకు భర్తతో కలిసి ప్రతాప్‌గఢ్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. అయితే రైలు రావడానికి ఇంకా సమయం ఉండటంతో ఆమె భర్త షాపింగ్ చేయడానికి రైల్వే స్టేషన్ బయటకు వెళ్లాడు. కాగా, టాయిలెట్ కోసం ఆ యువతి స్టేషన్ సమీపంలోని పబ్లిక్ టాయిలెట్ వద్దకు వెళ్లింది. అయితే జనం ఉండటంతో టికెట్ కౌంటర్ పక్కనే ఉన్న వెయిటింగ్ రూమ్‌లో వేచి ఉన్నది.
ఇంతలో ఓ కామంధుడు ఆ మహిళ వద్దకు వచ్చాడు. ఏమైనా సహాయం కావాలా అని అడిగాడు. దీంతో టాయిలెట్ కోసం చూస్తున్నట్లు ఆమె చెప్పింది. ఇదే అదునుగా భావించిన ఆ వ్యక్తి.. ఆమెను పబ్లిక్ టాయిలెట్ వద్దకు తీసుకెళ్లాడు. ఒక తాళం ఇచ్చి టాయిలెట్‌ను వినియోగించుకోమని చెప్పాడు. ఆమె టాయిలెట్ డోర్ తీయగానే.. వెంటనే లోపలికి చొరబడి.. డోర్ లాక్ చేశాడు. సదరు వివాహితపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
వివాహిత కేకలు వేయడంతో.. స్థానికులు సహాయం చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు లైంగిక దాడి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహారాష్ట్రలోని పూనేలో సమాజం సిగ్గుతో తలదించుకునే దారుణ ఘటన జరిగింది. కన్న కూతురిపైనే కన్న తండ్రి, ఇంటి సభ్యులు లైంగిక దాడులకు పాల్పడ్డారు. ఆభం శుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి తమ కామవాంఛ తీర్చుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత చిన్నారి (11) కుటుంబం బీహార్ నుంచి మహారాష్ట్రలోని పుణెకు వలస వచ్చింది. ఆ చిన్నారి చదువుతున్న పాఠశాలలో ఓ స్వచ్చంధ సంస్థ ఇటీవల గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అనే కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆ చిన్నారిని తన గోడును వెల్లడించింది.
గత ఐదేళ్లుగా తనపై తండ్రి, సోదరుడు, మేనమామ, తాతతో సహా ఆమె కుటుంబంలోని సభ్యులు అనేక సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడించింది. 2017 నుంచి తన కన్న తండ్రి నుంచి లైంగిక వేధింపులకు గురైనట్టు విచారణలో తెలింది. ఆ బాలిక ఎనిమిదేళ్ల వయసు నుంచే లైంగిక దాడికి గురవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. తాత, మేనమామ కూడా మైనర్‌ను లైంగికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇది సామూహిక లైంగిక దాడి కాదని, మైనర్‌పై లైంగిక దాడులన్నీ వేర్వేరు సందర్బాల్లో జరిగాయని పూణెలోని బండ్ గార్డెన్ పోలీస్ స్టేషన్ ఎస్సై అశ్విని సాత్పుతె పేర్కొన్నారు.