
తిరువనంతపురం: కేరళలో వరదలు తగ్గుముఖం పట్టాయి. అయితే వరదల్లో మునిగిపోయిన ఇళ్లలోకి పాములు, మొసళ్లు వచ్చి చేరాయి.అంతేకాదు వరదల కారణంగా ఇళ్లలోకి బురద వచ్చి చేరింది. ఇంకా చాలా గ్రామాలు వరద నీటిలోనే మునిగిపోయాయి.
వంద ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వరదలు వచ్చాయి. ఈ వరదల కారణంగా కేరళ తీవ్రంగా నష్టపోయింది. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. సుమారు నాలుగు వందలకు పైగా మృతి చెందారు.
సుమారు రెండు లక్షల మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకొంటున్నారు. వరదలు తగ్గుముఖం పట్టడంతో పునరావాస శిబిరాల నుండి ప్రజలు తమ ఇళ్లకు చేరుకొంటున్నారు. అయితే ఇళ్లలో బురద మట్టి పేరుకుపోయింది.
వరదనీటిలోనే రోజుల తరబడి ఉన్న కారణంగా పాములు , మొసళ్లు ఇళ్లలోకి చేరాయి. అయితే తమ ఇళ్లలోకి వచ్చిన జనం పాములతో భయబ్రాంతులకు గురౌతున్నారు.
త్రిసూర్ జిల్లాలోని చాలక్కూరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వరదలో ఉన్న తన ఇంటిని పరిశీలించేందుకు వెళ్లాడు.ఇంటికి వెళ్లిన అతను షాక్‌కు గురయ్యాడు. ఇంట్లో మొసలిని చూసి ఆ వ్యక్తి షాక్ తిన్నాడు. వెంటనే స్థానికులను తీసుకొని వచ్చాడు.
తన ఇంట్లోని వరద నీటిలో ఉన్న మొసలిని బంధించాడు. ఆ మొసలిని సమీపంలోని చెరువులో వేశారు. మరో వైపు అలప్పుజా, పతనమిత్త, ఇడుక్కి, కోజికోడ్, ఎర్నాకుళం, మలప్పురం, వాయనాడ్ లలో వరదల కారణంగా తీవ్రంగా నష్టం జరిగింది.