నదిలో స్నానం చేస్తుండగా.. 38యేళ్ల వ్యక్తిని లాక్కెళ్లిన మొసలి...

By SumaBala BukkaFirst Published May 19, 2022, 7:11 AM IST
Highlights

రాజస్థాన్ లో ఓ అనుకోని సంఘటన ఓ కుటుంబాన్ని విషాదంలో నింపింది. ఉదయం పూట స్నానానికి నదిలో దిగిన వ్యక్తిని మొసలి లాక్కెళ్లింది. దీంతో కోట ప్రాంతంలో తీవ్ర కలకలం చెలరేగింది. 
 

రాజస్థాన్ : rajasthan లోని కోటలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నదిలో స్నానం చేస్తున్న ఓ 38 ఏళ్ల వ్యక్తిపైకి ఓ Crocodile అకస్మాత్తుగా దూసుకొచ్చింది. అతడిపై దాడి చేసి riverలోకి లాక్కెళ్ళిపోయింది. ఈ ఘటన ఖటోలి పట్టణంలో వెలుగు చూసింది. సమాచారం అందుకున్న అధికారులు బాధితుడి కోసం గాలింపుచర్యలు కొనసాగిస్తున్నారు.  ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం..  బిల్లూ అనే వ్యక్తి ఖటోలి  పట్టణంలోని పార్తి నదిలో రామ్ ఘాట్ వద్ద ఉదయం స్నానానికి దిగాడు.  నదిలో ఉన్న ఓ మొసలి  అతడి పైకి ఒక్కసారిగా దూసుకు వచ్చింది.  అతడిని లోపలికి లాక్కెళ్ళిపోయింది.

దీంతో నదిలో స్నానం చేస్తున్న మిగతా వ్యక్తులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కోట నుంచి ఎస్ డిఆర్ఎస్ బృందం  సహకరించాలని స్థానిక అధికారులు కోరారు. ఇటీవల యూపీలోని ఇలాంటి ఘటన వెలుగు చూసింది. చెరువులో స్నానానికి దిగిన ఓ చిన్నారిని మొసలి అమాంతం పట్టుకుని బలితీసుకుంది. 

ఇదిలా ఉండగా, నిరుడు అక్టోబర్లో  కర్ణాటకలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకుంది. స్నేహితులంతా కలిసి సరదాగా గడిపేందుకు నదీతీరానికి వెళ్లారు. ఒడ్డున కూర్చుని నదిలో గాలం వేసి చేపలు పడుతుండగా  ఓ యువకుడిపై మొసలి దాడి చేసి అమాంతం నీటిలోకి లాక్కెళ్ళిపోయింది. వివరాల్లోకి వెళితే… కర్ణాటకలోని ఉత్తర కన్నడ  దాండేలి తాలూకా వినయక నగర్ కు చెందిన మోహిన్ మహమూద్ (15)  ఆదివారం సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ఖాళీ నదీతీరానికి వెళ్లాడు. స్నేహితులంతా కలిసి ఒడ్డున కూర్చుని నీటిలో గాలం వేసి చేపల వేటకు దిగారు.

ఈ క్రమంలో మోహిన్ కూడా నది ఒడ్డున ఒక చోట కూర్చుని గాలం వేసి చేపలు పడుతున్నాడు. ఈ సమయంలోనే ఓ మొసలి నీటిలో మెల్లగా వచ్చి ఒక్కసారిగా మోహిన్ ను నీటిలోకి లాక్కుని వెళ్ళిపోయింది. దీంతో భయభ్రాంతులకు గురైన మిగతా యువకులు పరుగున వెళ్ళి గ్రామస్తులకు విషయం తెలిపారు. గ్రామస్తులంతా కలిసి నదిలో ఎంత గాలించినా ఎక్కడా మొసలి జాడ గాని,  యువకుడి జాడగానీ  కనిపించలేదు.  దీంతో వారు చేసేది ఏమీలేక పోలీసులకు సమాచారం  ఇచ్చారు.

పోలీసులు కూడా గజ ఈతగాళ్లను రప్పించినా ఫలితం లేకుండా పోయింది. యువకుడి జాడ కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద నీటితో పాటు మొసళ్లు నదిలోకి వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలియక నది వద్దకు వెళుతూ ప్రమాదాలకు గురి అవుతున్నారని.. తాజాగా యువకుడి ఘటన కూడా అలాంటిదే అని అన్నారు. ఇకపై మరెవ్వరూ నదిలోని మొసళ్ల బారిన పడకుండా అధికారిక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. యువకుడి గల్లంతుతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మోహన్ కుటుంబ సభ్యులు నదివద్ద బోరున విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. ఆచూకీ కోసం తీవ్ర గాలింపు కొనసాగింది. 

click me!