Covid-19: ఢిల్లీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సరిహద్దుల్లోని యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. లక్నోతో సహా రాజధాని పరిధిలోని (ఎన్సీఆర్) ఆరు జిల్లాలు గౌతమ్ బుద్ధ్ నగర్, ఘజియాబాద్, హపూర్, మీరట్, బులంద్‌షెహర్, బాఘ్‌పట్‌లో మాస్కు ధారణను తప్పనిసరి చేసింది. జూన్ 10 వరకు ఘజియాబాద్‌లో సెక్షన్ 144 విధిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Covid-19: భారత్ లో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో రోజు వారీ కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఈ పెరుగుదలను గమనిస్తే.. ఫోర్త్ వేవ్ వచ్చిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2,183 కేసులు నమోదయ్యాయి. ఆదివారంతో పోలిస్తే ఇది 90 శాతం ఎక్కువ. గత రెండు నెలల తరువాత ఇలా అధిక స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. డైలీ పాజిటివిటీ రేటు కూడా 0.31 శాతం నుంచి 0.83 శాతానికి ఎగబాకింది.
బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ తప్పనిసరి .
undefined
ఇదిలా ఉంటే.. కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో మళ్లీ ఆంక్షలు విధించింది. రాష్ట్ర రాజధాని లక్నోతో సహా ఆరు పట్టణాల్లో కరోనా ఆంక్షలను అమలులోకి తీసుకవచ్చింది. కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న గౌతమ్ బుద్ధనగర్, ఘజియాబాద్, హాపూర్, మీరట్, బులంద్‌షహర్, బాగ్‌పత్, లక్నోలోని బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. ఈ నిబంధన సోమవారం నుంచి అమలు చేస్తున్నట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో.. గౌతమ్ బుద్ధ నగర్‌లో 65, ఘజియాబాద్‌లో 20, లక్నోలో 10 కొత్త కోవిడ్ కేసులు నిర్ధారించబడ్డాయి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఘజియాబాద్‌లో 144 సెక్షన్
ఘజియాబాద్‌లో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది. పలు పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దాంతో ఆ పాఠశాలలను తాత్కాలికంగా క్లోజ్ చేశారు. వారితో సన్నిహితంగా ఉన్నవారిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. ఈ క్రమంలో ఘజియాబాద్‌లో 16వ తేదీ నుంచి జూన్ 10 వరకు 144 సెక్షన్‌ను విధిస్తున్నట్టు అధికారులు తెలిపారు. జనం ఎక్కువగా గుమికూడదని అధికారులు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో కరోనా కేసుల పెరుగుదలపై దృష్టిసారించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.ఎన్‌సీఆర్ జిల్లాల్లో టీకాలు వేయని వారిని గుర్తించి యుద్ధప్రాతిపదికన టీకాలు వేయాలని సంబంధిత అధికారులను యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. తాజా పరిస్థితులు, పెరుగుతున్న కోవిడ్ కేసుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించమని వారిని అడగడానికి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ను ఉత్తమంగా ఉపయోగించుకోవాలని సంబంధిత జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు. UPలో మొత్తం 695 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సోమవారం..ఒక్క రోజే.. రాష్ట్రంలో 83,864కి పైగా పరీక్షలు నిర్వహించగా, అందులో 115 మందికి కోవిడ్ పాజిటివ్‌గా గుర్తించారు.
మరోవైపు .. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కొత్తగా 517 కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో ఇది 25 శాతంగా ఉండటం గమనార్హం. గత 15 రోజుల్లో ఢిల్లీలో కరోనా వ్యాప్తి దాదాపు 500 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. అయితే, రాజధానిలో పరిస్థితులు మరీ అంత ప్రమాదకరంగా లేవని, దవాఖానలో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉన్నదని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. కరోనా టెస్ట్‌లను పెంచాలని సూచించారు. దీంతో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న యూపీలోని పలు ప్రధాన నగరాల్లో కరోనా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.