టీకాలు థర్డ్ పార్టీలు తయారు చేశాయ్.. మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదు: సుప్రీంకోర్టులో కేంద్రం

By Mahesh KFirst Published Nov 29, 2022, 2:21 PM IST
Highlights

కరోనా టీకాలను థర్డ్ పార్టీలు తయారు చేశాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పేర్కొంది. ఆ టీకాలను రెగ్యులేటరీలు సమీక్షించాయని, ఆ టీకాలు వేసుకుని సైడ్ ఎఫెక్ట్‌లతో మరణించినవారికి ప్రభుత్వం బాధ్యత వహించదని తెలిపింది.
 

న్యూఢిల్లీ: కరోనా టీకాలను థర్డ్ పార్టీలు తయారు చేశాయని, అవి సురక్షితమైనవని, కొవిడ్‌పై ప్రభావం చూపెడుతున్నాయని గుర్తించిన తర్వాతే టీకా పంపిణీలో ఉపయోగించామని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాంటప్పుడు టీకా వేసుకున్న పిటిషనర్ల పిల్లల విషాదకర మరణానికి ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుందని పేర్కొంది. అంతేకాదు, కొవిడ్ 19 టీకా వేసుకోవాలని చట్టపరంగా తప్పనిసరి అని చెప్పలేదని వివరించింది.

కరోనా టీకా సైడ్ ఎఫెక్ట్‌లతో ఇద్దరు పిల్లలు మరణించారని వారి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌కు జవాబుగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. పిటిషనర్ల పిల్లల మరణానికి ప్రభుత్వం ఎలా కారణం అవుతుందో తెలిపే మెటీరియల్ ఏదీ లేదని, అది లేకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద ప్రభుత్వాన్ని పరిహారం అడిగే అవకాశమే ఉండదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ అఫిడవిట్‌లో పేర్కొంది. 

టీకా పంపిణీలో ఉపయోగించిన వ్యాక్సిన్‌లు థర్డ్ పార్టీలు తయారు చేసినవని.. అవి మన దేశంలో, ఇతర దేశాల్లోనూ విజయవంతంగా రెగ్యులేటరీలు సమీక్షించాయని, ప్రపంచవ్యాప్తంగా వాటికి గుర్తింపు ఉన్నదని ప్రభుత్వం తెలిపింది. ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని టీకాల సైడ్ ఎఫెక్టులతో చాలా అరుదుగా జరిగే మరణాలకు ప్రభుత్వాన్ని బాధ్యురాలు చేయడం చట్టపరంగా నిలువదని వివరించింది. 

Also Read: కరోనా వ్యాక్సిన్ వల్లే నా కుమార్తె చనిపోయింది... రూ.1000 కోట్లు చెల్లించాలి..

అయితే, టీకా సైడ్ ఎఫెక్ట్‌తో ఎవరైనా గాయపడినా, మరణించినా అందుకు చట్టపరిధిలోనే పలు అవకాశాలు ఉన్నాయని, వారు సివిల్ కోర్టులకు వెళ్లి నష్టపరిహారాన్ని అడగవచ్చని ఆరోగ్య శాఖ వివరించింది. అవి సంబంధిత ఫోరమ్‌లో ఒక్కో కేసుకు విడిగా పరిష్కారాన్ని నిర్దారించాల్సి ఉంటుందని తెలిపింది.

నవంబర్ 23న హెల్త్ మినిస్ట్రీ దాఖలు చేసిన ఈ అఫిడవిట్‌లో అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని బలంగా ప్రోత్సహించామని, కానీ, అది చట్టపరంగా తప్పనిసరి కాదని వివరించింది.

2021 మే నెలలో కొవిషీల్డ్ టీకా వేసుకున్న 18 ఏళ్ల యువతి తదుపరి నెల జూన్‌లో మరణించింది. జూన్ 2021లో కొవిషీల్డ్ టీకా వేసుకున్న మరో యువతి తర్వాతి మాసం జులైలో మరణించింది. ఈ ఇద్దరు యువతుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

click me!