
Meghalaya Chief Minister Conrad Sangma: మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా శుక్రవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ ఫాగు చౌహాన్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చర్చలు జరిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అధికార ఎన్పీపీ అధ్యక్షుడు కాన్రాడ్ సంగ్మా శుక్రవారం ఉదయం 11.30 గంటలకు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిసి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గురించి వివరిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. గవర్నర్ ను కలిసే సమయంలో ఎన్పీపీ, ఇతర మిత్రపక్షాల ఎమ్మెల్యేలు కూడా ఆయన వెంట ఉంటారని సమాచారం. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము గవర్నర్ ను కలిసి ఫలితాలను వివరిస్తామని పార్టీకి చెందిన ఒక నాయకుడు చెప్పారు. గవర్నర్ ను కలిసే ముందు సంగ్మా విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తారని వెల్లడించారు.
కాగా, మేఘాలయ అసెంబ్లీకి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగిన 59 స్థానాలకు గాను 26 స్థానాలను కైవసం చేసుకుని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, 60 మంది సభ్యుల అసెంబ్లీలో పార్టీ మ్యాజిక్ ఫిగర్ 31 కంటే తక్కువగా ఉండటంతో మరో పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఎన్పీపీ నేతలు పేర్కొంటున్నారు. బీజేపీతో కలిసి ఎన్పీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాన్రాడ్ సంగ్మా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మద్దతు కోరారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. 3 సీట్లు గెలుచుకున్న బీజేపీతో కలుస్తామని కాన్రాడ్ సంగ్మా ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఈ రెండు పార్టీలు గతంలో కలిసి ఉన్న అవినీతి ఆరోపణలతో విడిపోయాయి. తాజాగా బీజేపీ ఎన్పీపీకి సపోర్ట్ లెటర్ ను అందించింది.
అంతకుముందు, మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్పీపీకి మద్దతివ్వాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనకు ఫోన్ చేశారని మేఘాలయ బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ చెప్పారు. ఈ క్రమంలోనే సీఎం కాన్రాడ్ సంగ్మాతో మాట్లాడాననీ, రాష్ట్ర బృందంతో సంప్రదింపులు జరిపిన తర్వాత గురువారం రాత్రికి మద్దతు లేఖను అందించనున్నట్టు ఆయన తెలిపారని వార్తాసంస్థ ఏఎన్ఐ నివేదించింది.
కాగా, సంగ్మా ప్రభుత్వంలో ఎన్పీపీ మిత్రపక్షంగా ఉన్న యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ) 11 స్థానాల్లో విజయం సాధించి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2018 ఎన్నికల్లో కేవలం ఆరు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ ఐదో స్థానాల్లో, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఐదు స్థానాల్లో విజయం సాధించాయి. కొత్తగా ఏర్పడిన వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ (వీపీపీ) నాలుగు స్థానాలు గెలుచుకోగా, హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (హెచ్ఎస్పీడీపీ), పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ చెరో రెండు స్థానాల్లో విజయం సాధించాయి. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు.