
న్యూఢిల్లీ: Congress పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఆదివారం నాడు సాయంత్రం జరగనుంది. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కూడా ఆశించిన ఫలితాలు ఆ పార్టీకి దక్కలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత అసమ్మతి నేతలు ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
2021 అక్టోబర్ మాసంలో CWC సమావేశమైంది. సీడబ్ల్యుసీలో పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ పక్ష నేత సహా 23 మంది సభ్యులుంటారు. ఈ 23 మందిలో 12 మంది ఎఐసీసీ ద్వారా ఎన్నుకోబడిన 12 మంది సభ్యులుంటారు. ఐదు రాష్ట్రాల Assembly ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేదు. ఈ ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
2017 ఎన్నికల్లో Punjab లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 80 సీట్లు దక్కించుకొంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. Uttarakhand, Goa, Manipurరాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ మెరుగైన సీట్లు దక్కించుకోలేదు.
ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరం విన్పిస్తున్న G-23 నేతలు సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎఐసీసీ కొత్త అధ్యక్షుడి ఎన్నికతో పాటు పార్టీ సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయాలని కూడా అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఈ నెల 11వ తేదీన New Delhi లోని జీ 23కి నాయకత్వం వహిస్తున్న Ghulam Nabi Azad నివాసంలో కపిల్ సిబల్, మనీష్ తివారీ తదితరులు భేటీ అయ్యారు.
యూపీ రాష్ట్రంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు 5 అసెంబ్లీ సీట్లు ఉండేవి., ఈ ఎన్నికల్లో Priyanka Gandhi ప్రచారం నిర్వహించినా కూడా ఆ పార్టీకి కేవలం 2 సీట్లు మాత్రమే దక్కాయి. అంతేకాదు 97 శాతం మంది కాంగ్రెస్ అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోయారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2.4 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి.
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ను ఇదివరకే ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారంగా ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 16 నుండి 31 వరకు ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఆగష్టు 21 నుండి సెప్టెంబర్ 20 మధ్య ఎఐసీసీ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది.
గత ఏడాది Kerala, Bengal రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపై పార్టీ నేతలతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఇంకా నివేదికలు ఇవ్వలేదు. గత ఏడాది అసమ్మతి నేతలకు ఇచ్చిన హామీలను పార్టీ నాయకత్వం అమలు చేయలేదని జీ 23 నేతలు చెబుతున్నారు.
పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో సంస్కరణలు తీసుకు రావాలని గులాం నబీ ఆజాద్ సహా జీ 23 నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాము లేవనెత్తిన అంశాలపై పార్టీ నాయకత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోని కారణంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం మూట గట్టుకోవాల్సి వచ్చిందని జీ 23 నేతలు చెబుతున్నారు.