
కాంగ్రెస్ అధిష్టానం నేడు కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరగనున్న ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో.. ఈ వారం చివర్లో రాజస్తాన్ ఉదయపూర్‌లోని నిర్వహించనున్న చింతన్ శివిర్ ఎజెండాపై చర్చించనున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల తర్వాత సీడబ్ల్యూసీ భేటీ కావడం ఇది రెండోసారి. 2024 ఎన్నికలకు ముందు పార్టీని అంతర్గతంగా పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. సంస్థాగత సంస్కరణలకు ఈ సమావేశంలో సూత్రప్రాయంగా ఆమోదం తెలపనుంది. కనీస మద్దతు ధర చట్టం తెస్తామనే హామీ తీర్మానంపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.
రాజకీయ, సంస్థాగత సమస్యలతో పాటు, సామాజిక న్యాయం, ఆర్థిక పరిస్థితులు, రైతులు, యువత సమస్యలను చర్చించడానికి పార్టీ గత నెలలో ఆరు సమన్వయ ప్యానెల్‌లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్యానెల్స్ నివేదికలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఇక, అన్ని సంస్థాగతంగా వివిధ వర్గాలకు సామాజిక ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండేలా.. బూత్ స్థాయి, జిల్లా స్థాయి ముఖ్యులను నిర్ణయించేందుకు పార్టీ రాష్ట్ర యూనిట్లకు అధికారం కల్పించడంపై కూడా ఈ సమావేశంలో పార్టీ అధిష్టానం దృష్టి సారించనుంది. పీసీసీ నుంచి బ్లాక్ స్థాయి దాకా అన్ని కమిటీల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం వారి జనాభాకు అనుగుణంగా బాగా పెరగాలని కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే.
‘‘మేధోమథన సమావేశానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇందులో పార్టీని పునరుజ్జీవింపజేయడం, రాజకీయ మార్గాన్ని చర్చించడాన్ని లక్ష్యంగా పెట్టుకన్నాం. అయితే వాటితో పాటు అనేక సామాజిక, ఆర్థిక అంశాలను కూడా ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది’’ అని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇటీవల ముగిసిన ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై కాంగ్రెస్ అధిష్టనం దృష్టి సారింది. మే 13 నుంచి 15 వరకు చింతన్ శివర్ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ చింతన్ శివిర్‌లో రాజకీయంగా అనుసరించాల్సిన వ్యుహాలతో పాటుగా పొత్తుల ఏర్పాటుపై చర్చించనున్నారు. అలాగే ఎన్నికల వ్యుహాకర్త చేసిన ప్రశాంత్ కిషోర్ చేసిన సూచనలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక, ఇటీవల కాంగ్రెస్‌తో ప్రశాంత్ కిషోర్ సాగించిన విఫలమైన సంగతి తెలిసిందే. పీకే.. కాంగ్రెస్ పార్టీకి కొన్ని ప్రతిపాదనలు సమర్పించారు. . 2024 సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ "ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్"లో చేరేందుకు కాంగ్రెస్ ఆహ్వానించగా.. పీకే దానిని తిరస్కరించిన సంగతి తెలిసిందే..