
న్యూఢిల్లీ: మేఘాలయాలోని అంపటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి విజయం సాధించడంతో కర్ణాటక ఫార్మూలాను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
దేశవ్యాప్తంగా 4 ఎంపీ, 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపికి ఘోరమైన పరాభవం ఎదురైంది. ఒక్క ఎంపీ, ఒక్క అసెంబ్లీ స్థానంతోనే బిజెపి సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మేఘాలయాలోని తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకొంది. అంపటిలో కాంగ్రెస్ అభ్యర్థి మియానీ డీ షిరా 3,191 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజా గెలుపుతో మేఘాలయలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
మేఘాలయ రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. కాంగ్రెస్ పార్టీకి గతంలో 20 మంది ఎమ్మెల్యేలున్నారు. తాజాగా డీ షీరా గెలుపుతో కాంగ్రెస్ బలం 21కు చేరుకొంది. అధికార ఎన్సీపీకి కేవలం 20 స్థానాలు మాత్రమే ఉన్నాయి. బిజెపి, ఎన్సీపీ, ఇతర ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
కోనార్డ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ-బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కర్ణాటక రాజకీయాలను మేఘాలయలో పునరావృతం చేసి.. విపక్షాల ఐక్యతతో మరోప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపికి ఆ రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బిజెపికి అవకాశం కల్పించారు. అయితే విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప సీఎంపదవికి రాజీనామా చేశారు.
ఆ తర్వాత జెడీ(ఎస్), కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక పార్మూలా ప్రకారంగా అతి పెద్ద పార్టీగా అవతరించిన తమకుప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కల్పించాలని కాంగ్రెస్ పార్టీ కోరనుంది.