
Uttarakhand: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హరీష్ రావత్ మరోసారి బీజేపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓటమి ఖాయమనీ, అందుకే ఆ పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైందని అన్నారు. వివరాల్లోకెళ్తే.. ఉత్తరాఖండ్ (Uttarakhand) లో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో విజయం తమదేననీ, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని కాంగ్రెస్, బీజేపీ (BJP) నాయకులు ఓటింగ్ అనంతరం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యంత్రి హరీష్ రావత్ (Harish Rawat) మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఉత్తరాఖండ్ (Uttarakhand) లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదని హరీష్ రావత్ అన్నారు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొంటూ, పార్టీ ముఖ్యమంత్రి ముఖాన్ని ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరారు. "ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు.. ఈ అభివృద్ధి (ఓటింగ్) కాంగ్రెస్‌కు అనుకూలంగా జరిగింది.. ఈ విషయం తెలిసి భారతీయ జనతా పార్టీ టెన్షన్‌తో, ఆందోళనకు గురవుతోది" అని హరీష్ రావత్ అన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన ఓటింగ్ సరళి బీజేపీ (BJP) ఓటమిని స్పష్టం చేసిందిని ఆయన (Harish Rawat) పేర్కొన్నారు.
"ముఖ్యమంత్రిని నిర్ణయించమని మా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని అభ్యర్థిస్తాము. మా ముఖ్యమంత్రి ముఖం ప్రజలు కోరుకునే వ్యక్తి (దుల్హన్ వహీ జో పియా మాన్ భావే)" అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పేరుపై కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ అభ్యంతరం లేదని రావత్ (Harish Rawat) గతంలో ప్రకటించారు. ఈ సారి ఉత్తరాఖండ్ (Uttarakhand) అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండానే కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలిచింది. కాగా, ఉత్తరాఖండ్ అసెంబ్లీకి 70 మంది సభ్యులను ఎన్నుకోవడానికి ఫిబ్రవరి 14న ఎన్నికలు జరిగాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10 వెల్లడి కానున్నాయి. అయితే, ఉత్తరాఖండ్ లో బీజేపీ (BJP) అధికారంలోకి వస్తుందని ఇప్పటికే ముందస్తు సర్వే అంచనాలు సైతం పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం కాంగ్రెస్ నేతలు ఎదురుచూస్తున్నారు.
కాగా, ఇటీవల పంజాబ్ ఎన్నికలకు ముందు కూడా పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యంత్రి అభ్యర్థి గురించి పెద్ద చర్చ జరిగింది. ప్రస్తుమ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీతో పాటు, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ సైతం ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులు ఉన్నారు. సిద్దూనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఊహాగనాలకు తెరదించుతూ.. అనూహ్యంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ పార్టీ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఇదిలావుండగా, ప్రస్తుతం (ఆదివారం) పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల (Punjab Election 2022) పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో 2.14 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల బరిలో మొత్తం 1,304 అభ్యర్థులు నిలిచారు. అయితే వీరిలో కేవలం 93 మంది మహిళలు ఉన్నారు.