Punjab Assembly Election 2022: సిద్దూ వర్సెస్ చన్నీ.. పంజాబ్‌లో సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం: రాహుల్ గాంధీ

Published : Jan 27, 2022, 08:14 PM IST
Punjab Assembly Election 2022: సిద్దూ వర్సెస్ చన్నీ.. పంజాబ్‌లో సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం: రాహుల్ గాంధీ

సారాంశం

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. అక్కడ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీకి, పీపీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూకు మధ్య వైరం కొనసాగుతుండగా.. కాంగ్రెస్ అదిష్టానం ఆ నిర్ణయం వెల్లడించలేదు. కానీ, రాహుల్ గాంధీ తాజాగా, తన పంజాబ్ పర్యటనలో ఈ విషయంపై స్పందించారు. పంజాబ్‌లో తాము సీఎం క్యాండిడేట్‌ను ప్రకటిస్తామని వివరించారు. కాంగ్రెస్ వర్కర్లే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారని తెలిపారు. పంజాబ్‌ను ముందుకు తీసుకెళ్లే సీఎం అభ్యర్థికి మిగతా వారంతా తప్పకుండా సహకరించాలని అన్నారు.  

చండీగడ్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) పంజాబ్(Punjab) పర్యటనలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో వచ్చే నెల 14వ తేదీన ఎన్నికలు(Assembly Election) జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ పార్టీలో అంతర్గత విభేదాలు పలుమార్లు రచ్చకెక్కాయి. ముఖ్యంగా సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీకి పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. వీరిద్దరిలో పార్టీకి ఎవరు నాయకత్వం వహించాలి? అనే విషయంపై పెద్ద చర్చ జరిగింది. కానీ, ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలతో కాంగ్రెస్ అధిష్టానం కూడా పంజాబ్‌లో కాంగ్రెస్ ఎవరి నాయకత్వంలో బరిలోకి దిగాలనే విషయాన్ని ప్రకటించలేదు. కానీ, తాజాగా, రాహుల్ గాంధీ తన పంజాబ్ పర్యటనలో ఈ విషయంపై మాట్లాడారు.

పంజాబ్‌లో సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని రాహుల్ గాంధీ ఈ రోజు అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. పంజాబ్ ప్రజల కోసం, పార్టీ కార్యకర్తల కోసం ఈ నిర్ణయం తీసుకుందామని వివరించారు. కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని(CM Candidate) ఎలా నిర్ణయించుకుందాం? అని ప్రశ్నించారు. మళ్లీ ఆయనే సమాధానం ఇస్తూ.. కాంగ్రెస్ కార్యకర్తలే తమ సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తారని తెలిపారు. సీఎం అభ్యర్థిని నిర్ణయించుకోవడం వారి చేతుల్లోనే పెడుతున్నామని పేర్కొన్నారు. జలందర్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ఒక పార్టీని ఇద్దరు లీడ్ చేయలేరని ఆయన పేర్కొన్నారు. ఎవరో ఒకరే పార్టీకి నాయకత్వం వహించడం సరైన మార్గం అని తెలిపారు. ఒకరు నాయకత్వం వహిస్తే.. మరొకరు.. ఇతరులు అందరూ ఆయనకు మద్దతుగా నిలవాలని చెప్పారు.

ఈ ప్రకటనకు ముందే పీపీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూ, సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీలు తాము సీఎం అభ్యర్థిత్వం కోసం ఆరాట పడటం లేదని స్పష్టం చేయడం గమనార్హం. పంజాబ్ సీఎం అభ్యర్థిగా రాహుల్ గాంధీ గాంధీ ఎవరిని ఎన్నుకున్నా.. తాను ఆయన నిర్ణయాన్ని శిరసావహిస్తానని చెప్పారు. ప్రజల్లో చాలా గందరగోళం నెలకొని ఉన్నదని సిద్దూ అన్నారు. ఈ సంక్షోభం నుంచి తమను ఎవరు బయట వేయగలరని, అందుకు రోడ్ మ్యాప్ ఏమిటని మదనపడుతున్నారని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ నిర్ణయాలను ఎవరు అమలు పరుస్తారనే ప్రశ్నలు కూడా వారి మదిలో మెదులుతున్నాయని అన్నారు. ఒక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ సైనికుడిగా.. రాహుల్ గాంధీ సీఎం అభ్యర్థిపై తీసుకునే నిర్ణయాన్ని తప్పకుండా స్వాగతిస్తానని పేర్కొన్నారు.

అదే సమయంలో ఆయన మరో మెలిక పెట్టారు. మనమంతా ఒకటేనని, ఎవరూ టీఆర్పీ రేటింగ్ కోసం పాకులాడేవారు లేరని అన్నారు. మనమంతా మరోసారి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పోరాటంలో ఉన్నామని చెప్పారు. అందుకోసం నన్ను ఇక్కడే పాతిపెట్టినా.. నోరు మెదుపను అని పేర్కొన్నారు. కానీ, తనకూ నిర్ణయాధికారాన్ని ఇవ్వాలని, కేవలం ఒక షోపీస్‌గా ఉంచవద్దని వివరించారు. కాగా, అదే స్టేజీపై ఉన్న సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ, తాను కూడా సీఎం అభ్యర్థిత్వం కోసం ఆరాటపడం లేదని వివరించారు. నేను ఏ పోస్టు కోసం పాకులాడటం లేదని చన్నీ అన్నారు. మీరు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్‌ను సెలెక్ట్ చేయండి.. ఆయనకు క్యాన్వాసింగ్ చేసే మొదటి వ్యక్తిని తానే అవుతానని చెప్పారు. సిద్దూ సాబ్.. నేను చేతులు జోడించి చెబుతున్నా.. అరవింద్ కేజ్రీవాల్ వంటి బయటి వారు కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఉన్నాయని మనపై ఆరోపణలు చేయకుండా చూసుకుందామని అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం