
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (UP Assembly Elections) సమీపించిన తరుణంలో అన్ని పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. ఒకపార్టీపై మరో పార్టీ ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఒక వైపు.. పార్టీ నేతల ఫిరాయింపులు ఇంకో వైపు రసవత్తరంగా సాగుతున్నాయి. బీజేపీ (BJP), సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party)ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ సారి కాంగ్రెస్ పార్టీ (Congress Party), సమాజ్‌వాదీ పార్టీలు జట్టు కట్టలేదు. కాంగ్రెస్ ఏ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేస్తున్నది. అంతేకాదు, 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆ పార్టీ రాష్ట్రంలోని అన్ని అంటే 403 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఇన్‌చార్జీగా ఉన్న ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) మాట్లాడుతూ, తాము ఈ ఎన్నికల్లో మా శాయశక్తుల పోరాడుతున్నామని వివరించారు. గత 30 ఏళ్లలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తున్నదని తెలిపారు. తాము ప్రజ ప్రయోజనమైన అంశాలను లేవనెత్తుతున్నామని, ప్రజలకు ఇబ్బందిగా మారిన విషయాలపై పోరాడుతున్నామని అన్నారు. ప్రియాంక గాంధీ శుక్రవారం గజియాబాద్, సాహిబాబాద్‌లో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ దివంగత నేత రాజీవ్ త్యాగీ సతీమని సంగీత త్యాగీని ఈ స్థానంలో కాంగ్రెస్ టికెట్‌పై బరిలోకి దించుతున్నారు.
ఇదిలా ఉండగా, బీజేపీ(BJP) తప్పు ఏ చిన్నది దొరికినా.. కాంగ్రెస్(Congress) వదిలిపెట్టడం లేదు. వీలైన అన్ని మార్గాల్లో ప్రచారాన్ని విస్తృతం చేస్తూ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటున్నది. ఇందులో భాగంగానే తాజాగా, కాంగ్రెస్ పార్టీ ఓ ఎలక్షన్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. ఈ పాట తెలుగు సినిమా ‘పుష్ప’(Pushpa)లోని ‘శ్రీవల్లి’ పాట ట్యూన్. ఈ ట్యూన్ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఓ పాటను విడుదల చేసింది. యూపీ ఉన్నతిని పొగుడుతూ ఆ పాటు సాగుతుంది.
యూపీకి చెందిన వారిగా మేం గర్విస్తున్నాం అనే ట్యాగ్‌తో ఈ పాటను కాంగ్రెస్ రిలీజ్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రక కట్టడాలు, సుందర ప్రాంతాలను ఆ పాట వీడియోలో బంధించారు. అలాగే, 1857 భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం, ఆ తర్వాతి స్వాతంత్ర్య పోరాటంలోనూ ఉత్తరప్రదేశ్ నుంచి పోరాడిన కొందరు యోధుల పేర్లనూ ఆ పాట పేర్కొంది. తాము యూపీ టైప్ అంటూ ఈ పాట సాగింది. యూపీ టైప్ అని పాడిన ఈ పాట కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కౌంటర్‌గానే కాంగ్రెస్ ప్రయోగించినట్టు తెలుస్తున్నది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ అనంతరం ఆమె ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చిన్నచూపుగా యూపీ టైప్ అనే శబ్దాన్ని ప్రయోగించారు. ఈ పద ప్రయోగం రాజీకయంగా కలకలం రేపింది. కాంగ్రెస్ నేత, ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల బాధ్యతలు తీసుకున్న ప్రియాంక గాంధీ వెంటనే నిర్మలా సీతారామన్‌కు కౌంటర్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ప్రజలను అవమానించాల్సిన అవసరం ఏం వచ్చిందని ఆమె నిలదీశారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు.. యూపీ టైప్‌గా ఉండటాన్ని గర్విస్తారని అర్థం చేసుకోండి అంటూ హితవు పలికారు.