
Manipur Assembly Election 2022: ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు హీటు పెంచాయి. ఈ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. అధికారపీఠం దక్కించుకోవాలని వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఆయా పార్టీల నాయకులు విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. అయితే, ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల జాబితాను ప్రటిస్తున్నాయి. ఈ క్రమంలోనే మణిపూర్ లోనూ ప్రధాన రాజకీయా పార్టీలు అభ్యర్థుల జాబితా సిద్దం చేస్తున్నాయి.
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. తౌబాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మణిపూర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీ సింగ్ 40 మందితో కూడిన జాబితాను విడుదల చేశారు. మణిపూర్ కాంగ్రెస్ నాయకుడు, తోచకోమ్ లోకేశ్వర్ సింగ్.. కుంద్రకంపం నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. పంగ్గేజం శరత్ చంద్ర సింగ్.. హింటెర్ లాండ్ ప్రాంతాల నుండి పోటీ చేయనున్నారు. మహమ్మద్ అమీన్ షా.. ఖేత్రిగావ్ నుంచి, సెరమ్ నికెన్ సింగ్ థోంగ్జు నుంచి పోటీ చేయనున్నారు.
కాగా, మణిపూర్‌లో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఫిబ్రవరి 27న మొదటి దశ ఎన్నికలు జరగనుండగా, రెండో దశ ఎన్నికలు మార్చి 3న జరగనున్నాయి. తొలి విడుత ఓటింగ్‌కు ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 8న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ కాగా, ఫిబ్రవరి 9 వరకు నామినేషన్ పత్రాల పరిశీలన, ఫిబ్రవరి 11 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. ఇక మార్చి 3న జరగనున్న రెండవ దశకు ఓటింగ్ కు ఫిబ్రవరి 4న నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఈసీ.
2017 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 స్థానాలను గెలుచుకుని సంపూర్ణ మెజారిటీతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఆ తర్వాత చాలా మంది నేతలు కాంగ్రెస్‌ను వీడారు. ఆ తర్వాత బీజేపీ నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్). నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP), లోక్ జనశక్తి పార్టీ (LJP), ఇతర స్వతంత్ర అభ్యర్థుల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సారి మొదటి దశలో 6 జిల్లాలకు, రెండో దశలో 10 జిల్లాలకు ఎన్నికలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో మణిపూర్ సహా మొత్తం ఐదు రాష్ట్రాల్లో జరిగే భౌతిక సమావేశాలు, ఎన్నికల ప్రచార సమావేశాలు, రోడ్ షోలు, ర్యాలీలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఈ నెలాఖరు వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. ఇదిలా ఉండగా, ప్రభుత్వాలతో సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్ (SoO) మరియు మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (MOU) సంతకాలు చేసి ప్రస్తుతం నియమించబడిన శిబిరాల్లో ఉన్న మణిపూర్‌లోని పలు గ్రూపుల సభ్యులు పోస్టల్ బ్యాలెట్ (PB) ద్వారా ఓటు వేయడానికి అర్హులని ఎన్నికల సంఘం పేర్కొంది.