
భారతదేశంలో ఐడియాలజీ(భావజలం) యుద్ధం నడుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో సిద్ధాంతం ఉంటే.. మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల భారత్ టోడో సిద్ధాంతం ఉందని విమర్శించారు. జేడీయూ అధినేత నితిష్ కుమార్ నేతృత్వంలో నేడు బీహార్ రాజధాని పాట్నాలో విపక్షాల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు బీహార్ చేరుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ పాట్నా చేరుకున్నారు. ఈ క్రమంలోనే పాట్నాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ డీఎన్‌ఏ బీహార్‌లో ఉందని రాహుల్ గాంధీ అన్నారు. విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కృషి చేస్తోందని విమర్శించారు. తాము ప్రేమను పంచడానికి, ఏకం చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు ఈరోజు ఇక్కడికి వచ్చాయని.. అంతా కలిసి బీజేపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లను గెలుస్తామని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎక్కడా కనిపించదని విమర్శించారు. తాము పేదల పక్షాన నిలబడి గెలుస్తామని.. బీజేపీ అంటే కేవలం ఇద్దరు ముగ్గురికి మాత్రమే లబ్ధి చేకూరుస్తుందని రాహుల్ విమర్శించారు. ఇక, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. బీహార్‌లో గెలిస్తే దేశవ్యాప్తంగా గెలుస్తామని అన్నారు.