
Modi Surname Case:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో ఊరట లభించింది. ప్రధాని మోదీ ఇంటి పేరు (Modi Surname Case)పై రాహుల్ గాంధీకి సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఎంపీ హోదాను పునరుద్ధరించింది. ఈ తీర్పుపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇది ప్రజాస్వామ్య విజయం అని సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించింది. ‘ఇది ద్వేషంపై ప్రేమ విజయం.. సత్యమేవ జయతే - జై హింద్’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
సుప్రీం తీర్పును కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్వాగతించారు. 'న్యాయమైన నిర్ణయం ఇచ్చినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు. సత్యమేవ జయతే' అని ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ఈరోజు సంతోషకరమైన రోజు.. ఈరోజే లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసి..మాట్లాడతానని అన్నారు. సత్యమేవ జయతే అని ఈరోజు రుజువైందనీ, రాహుల్ గాంధీపై కుట్ర విఫలమైందని అన్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై పరువునష్టం కేసులో శిక్షను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, ఇది సత్యం, ఇదే న్యాయం అని పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మాట్లాడుతూ.. "ఎంత భారమైనా, సముద్రం దాటినా.. సత్యమే విజయం సాధిస్తోంది. రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై స్టే విధించిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని భారతదేశం స్వాగతిస్తోంది. సత్యమేవ జయతే! ఇది ఇండియా విజయం." అని పేర్కొన్నారు. మరోవైపు.. ‘మోదీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఏఐసీసీ కార్యాలయంలో సంబరాలు జరుగుతున్నాయి.
ఇదీ జరిగింది..
2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ కర్ణాటకలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంలో పార్టీ నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నీరవ్ మోదీ.. లలిత్ మోదీ’ దొంగలందరిదీ ఒకే ఇంటి పేరా? అని అన్నారు. ఈ వ్యాఖ్యాలు వివాదస్పదంగా మారాయి. పలు చోట ఆందోళనలు నెలకొన్నాయి.
ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే.. రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. గుజరాత్ హైకోర్టు ఆ తీర్పును సమర్థించింది. ఇలా కింది కోర్టుల్లో రాహుల్ గాంధీకి ఊరట దక్కకపోవడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని కోరారు.
ఈ క్రమంలో ఆయన కేసును వాదించిన న్యాయమూర్తులు బిఆర్ గవాయి, పిఎస్ నరసింహ, సంజయ్ కుమార్‌లతో కూడిన త్రిసభ్య సుప్రీంకోర్టు ధర్మాసనం ఎటువంటి సందేహం లేదని, బహిరంగ ప్రసంగాలు చేసేటప్పుడు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారు. గరిష్ట శిక్ష విధించడానికి ట్రయల్ జడ్జి ఎటువంటి కారణం చెప్పలేదనీ, తుది తీర్పు పెండింగ్‌లో ఉన్నందున దోషిగా నిర్ధారించే ఉత్తర్వును నిలిపివేయాలని బెంచ్ పేర్కొంది.