Punjab Elections 2022: విచిత్రం.. బీజేపీ క్యాంపెయిన్‌‌లో కాంగ్రెస్ ఎంపీ.. ఓట్లు వేయండని విజ్ఞప్తి

Published : Feb 13, 2022, 12:57 PM ISTUpdated : Feb 13, 2022, 01:27 PM IST
Punjab Elections 2022: విచిత్రం.. బీజేపీ క్యాంపెయిన్‌‌లో కాంగ్రెస్ ఎంపీ.. ఓట్లు వేయండని విజ్ఞప్తి

సారాంశం

పంజాబ్ ప్రచారం చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. పటియాలలో కెప్టెన్ అమరీందర్ సింగ్ కోసం బీజేపీ నిర్వహించిన ఓ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ, కెప్టెన్ అమరీందర్ సింగ్ సతీమణి ప్రినీత్ కౌర్ హాజరయ్యారు. తన భర్త కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ ఎంపీ.. బీజేపీ ప్రచార కార్యక్రమానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

చండీగడ్: ఎన్నికల వేళ ఎన్నో చిత్రాలు ముందుకు వస్తున్నాయి. పంజాబ్‌(Punjab)లో ఊహించని విచిత్రం జరిగింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్(Congress). బీజేపీ(BJP)లు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీలకు పొసగదు. రెండూ భిన్న భావజాలాలే కాదు.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులు. ఒక పార్టీ నేత మరో పార్టీకి ప్రచారం కాదు కదా.. కనీసం పరోక్ష మద్దతు ప్రకటించడం కూడా జరగదు. అలాంటిది.. ఒక బీజేపీ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ వెళ్లడాన్ని ఊహించగలమా? అదీ ప్రచారంలో భాగంగా బీజేపీ సమావేశానికి హాజరై ఓట్లను అడగడాన్ని అంచనా వేయగలమా? కానీ, పంజాబ్‌లో అదే జరిగింది.

పంజాబ్‌ పాటియాల ఎంపీ ప్రినీత్ కౌర్(MP Preneet Kaur).. బీజేపీ మీటింగ్‌కు హాజరయ్యారు. ఆ సమావేశానికి వెళ్లి తన భర్త కెప్టెన్ అమరీందర్ సింగ్‌(Captain Amarinder Singh)కు ఓట్లు వేయాలని అడిగారు. సిర్హిందీ గేట్ వద్ద శనివారం బీజేపీ ఓ సమావేశాన్ని నిర్వహించింది. బీజేపీ మిత్రపక్షం పంజాబ్ లోక్ కాంగ్రెస్ కోసం ఆ మీటింగ్‌ను నిర్వహించింది. పాటియాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు ఓట్లు వేయాల్సిందిగా ఆయన భార్య కాంగ్రెస్ ఎంపీ ప్రినీత్ కౌర్ ప్రచారం చేశారు.

పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. వారి మధ్య పోరు సీఎం కుర్చీకే ముప్పు తెచ్చింది. పంజాబ్ సీఎంగా కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను కాంగ్రెస్ అధిష్టానం తొలగించింది. ఆ తర్వాత సీఎంగా చరణ్ జిత్ సింగ్ చన్నీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్ ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ తన రాజీనామా పత్రాన్ని సమర్పించిన తర్వాత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

బీజేపీ అగ్రనాయకత్వంతో భేటీ అయ్యారు. అనంతరం పంజాబ్ లోక్ కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఈ పార్టీ అభ్యర్థిగానే ఆయన తన సొంత నియోజకవర్గం పటియాల నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన భార్య ప్రినీత్ కౌర్ పటియా పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. ఈ అసెంబ్లీ ఎన్నికలకు పంజాబ్ లోక్ కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీ దళ్(సంయుక్త్)లు కలిసి బరిలోకి దిగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే కెప్టెన్ అమరీందర్ సింగ్ కోసం బీజేపీ పార్టీ పటియాలలో ఓ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి కెప్టెన్ అమరీందర్ సింగ్ సతీమణి, కాంగ్రెస్ ఎంపీ ప్రినీత్ కౌర్‌ రావడం ప్రాముఖ్యత సంతరించుకున్నది.

కొంత కాలంగా కాంగ్రెస్ కార్యకలాపాలకు ప్రినీత్ కౌర్ దూరంగా ఉంటున్నారు. పటియాల(అర్బన్) నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన విష్ణు శర్మ ఇప్పటికే ఎంపీ ప్రినీత్ కౌర్ వివరణ కోరారు. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయాలని లేదంటే .. రాజీనామా చేయాలనే అల్టిమేటం ఆయన ఇచ్చారు. ఎన్నికల వేళ ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారని విలేకరులు గురువారం అడగ్గా.. తాను తన కుటుంబం వెంటే ఉన్నారని, అన్నింటికంటే తనకు తన కుటుంబమే మిన్న అని స్పష్టం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Travel Guide : తెల్లని ఇసుక, రంగురంగుల పగడపు దిబ్బలు.. ఆసియాలోనే అందమైన బీచ్ మన దక్షిణాదిదే.. ఈ ప్రాంతం భూతల స్వర్గమే
ఘనంగా గణతంత్ర వేడుకలు | ప్రధాని మోడీ సెక్యూరిటీ చూశారా | Republic Day 2026 | Asianet News Telugu