congress Chintan Shivir : కుటుంబంలో ఒకరికే టికెట్... మేధోమథనంలో కీలక నిర్ణయం

By Siva KodatiFirst Published May 13, 2022, 5:10 PM IST
Highlights

ఎన్నికల్లో వరుస పరాజయాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబంలో ఒకరికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు రాజస్థాన్‌లోని  ఉదయ్ పూర్‌లో జరుగుతున్న చింతన్ శివిర్‌లో సోనియా గాంధీ పలు నిర్ణయాలను వెల్లడించారు. 

పార్టీలో ప్రక్షాళన, 2024 ఎన్నికలే లక్ష్యంగా రాజస్థాన్‌లోని (rajasthan) ఉదయ్‌పూర్ (udaipur) చింతన్ శివిర్‌ను (Chintan Shivir) నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ (congress) . ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబంలో ఒకరికే టికెట్ ఇస్తామని ప్రకటించింది. పార్టీ మనకు చాలా ఇచ్చిందని.. ఇప్పుడు పార్టీకి ఇవ్వాల్సిన సమయం వచ్చిందని సోనియా గాంధీ (sonia gandh) అన్నారు. దేశ ప్రజల్ని బీజేపీ భయాందోళనలకు గురిచేస్తోందని సోనియా మండిపడ్డారు. మైనార్టీలను బీజేపీ (bjp) క్రూరంగా అణిచివేస్తోందని.. దేశంలో మైనార్టీలకు సమాన హక్కులు వున్నాయని ఆమె స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని.. ప్రతిపక్షాలను కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీజీ హంతకులను ఆరాధిస్తున్నారని ఆమె మండిపడ్డారు. 

అంతకుముందు .. ఈ చింతన్ శివిర్ కార్యక్రమం నేపథ్యంలో కాంగ్రెస్ లీడర్ అజయ్ మాకెన్ కీలక విషయాలు వెల్లడించారు. పార్టీ లీడర్‌కు తప్పితే వారి బంధువులకు టికెట్ ఇవ్వరాదనే నిబంధనకు నేతలు సుముఖంగా ఉన్నారని తెలిపారు. అయితే, వారికీ టికెట్ ఇవ్వాలంటే వారు కనీసం ఐదు సంవత్సరాలు పార్టీ కోసం పని చేసి ఉండాలని చెప్పారు. ఈ నిబంధన నుంచి గాంధీలకు మినహాయింపు ఉన్నదా? అని ప్రశ్నించగా.. వారు రాజకీయాల్లో ఐదేళ్లుగా యాక్టివ్‌గా ఉన్నారని, ప్రియాంక గాంధీ 2018 నుంచే పార్టీ కోసం పని చేస్తున్నారని వివరించారు.

ఈ నిబంధనతోపాటు కాంగ్రెస్ మరికొన్ని మార్పులు చేయబోతున్నది. రాజ్యసభ సభ్యుల ఎన్నికపైనా ఏజ్ లిమిట్ పెట్టనుంది. కాంగ్రెస్ పార్టీలో సగం మంది నేతలు 50 ఏళ్లకు లోబడే ఉండాలనే కండీషన్ పెట్టబోతున్నది. దేశంలో 60 శాతం మంది ప్రజలు 40 ఏళ్లలోపు వారేనని, కాబట్టి, తమ పార్టీ యూనిట్లూ సాధారణ ప్రజానీకాన్ని ప్రతిబింబించేలా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మానిక్కం ఠాగూర్ తెలిపారు. ఈ మేధోమథన కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ నిబంధనలు పార్టీలో అమలు అవుతాయని నేతలు చెబుతున్నారు.

వీటితోపాటు ఈ మూడు రోజుల సదస్సులో వ్యవస్థాగత విషయాలతోపాటు, దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, సామాజిక న్యాయం, రైతులు, యువతపై చర్చ చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రూపులను ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపులో 60 నుంచి 70 మంది ఉండబోతున్నారని తెలిసింది. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలంటే ఏం చేయాలి.. ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించనున్నారు కాంగ్రెస్ నేతలు. మిషన్ 2024 పేరుతో కాంగ్రెస్ రూపొందిస్తున్న వ్యూహాన్ని ఈ శిబిరం ద్వారా శ్రేణుల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. 
 

click me!