రాముడు, కృష్ణుడి ఉనికిపై కాంగ్రెస్, సీపీఎంలకు నమ్మకం లేదు: త్రిపుర ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి ఆదిత్యనాథ్

By Rajesh KarampooriFirst Published Feb 8, 2023, 5:33 AM IST
Highlights

యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ త్రిపుర చాలా సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ , కాంగ్రెస్ పాలనల "దుష్పరిపాలన"కు సాక్ష్యమిస్తోందని అన్నారు. అలాగే.. రాముడు లేదా కృష్ణుడి ఉనికిపై సీపీఎం, కాంగ్రెస్‌లకు నమ్మకం లేదని విమర్శించారు. 

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. తాజాగా త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్,సీపీఐ(ఎం)లను టార్గెట్ చేసుకున్నారు. ఆ రెండు పార్టీలకు రాముడు , కృష్ణుడి ఉనికిని నమ్మడం లేదని మంగళవారం ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథ్ ఆలయ కారిడార్ , రామమందిర నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఈ రెండు పార్టీలు కూడా ప్రయత్నించాయని ఉత్తర త్రిపురలోని బగబస్సాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

త్రిపుర ప్రజలు చాలా సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ , కాంగ్రెస్ పాలనల "దుష్పరిపాలన"ను చూశారని, అయితే చిన్న ఈశాన్య రాష్ట్రం బిజెపి హయాంలో మొదటిసారిగా అభివృద్ధిని నమోదు చేసిందని ఆదిత్యనాథ్ అన్నారు. త్రిపురలో కాంగ్రెస్ , సీపీఐ(ఎం) ఎక్కువగా పాలించగా, 25 ఏళ్ల వామపక్ష పాలనకు ముగింపు పలికి 2018లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఫిబ్రవరి 16న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్‌ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారనీ, అయోధ్యలో కూడా రామ మందిర నిర్మాణానికి ముందు వారే పెద్ద అడ్డంకులు. వారు విశ్వాసాన్ని గౌరవించాలని కోరుకోరు. రాముడు లేదా కృష్ణుడు లేడని వారు పేర్కొన్నారని తెలిపారు. ఇప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం చివరి దశలో ఉందని చెప్పారు.

ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి ప్రక్రియను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్, సీపీఎం ప్రయత్నిస్తున్నాయని ఆదిత్యనాథ్ ఆరోపించారు. తాను 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు త్రిపురను చూశాననీ, ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి లోపామని చూశాననీ, ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వమే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిందని అన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను జాబితా చేస్తూ.. తొలిసారిగా ఎలాంటి రాజకీయాలకు అతీతంగా పౌరులకు ప్రయోజనాలు అందుతున్నాయని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్ల ఇది సాధ్యమైందని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించినప్పుడు అవినీతి తారాస్థాయికి చేరిందని ఆదిత్యనాథ్ అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే బొగ్గు కుంభకోణం, 2జీ కుంభకోణం, సీడబ్ల్యూజీ స్కామ్‌లు జరిగాయనీ, అవినీతి కాంగ్రెస్‌కు పర్యాయపదంగా మారిందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొనసాగాలని యూపీ ముఖ్యమంత్రి అన్నారు. ఆదిత్యనాథ్ బుధవారం ఉనకోటి, పశ్చిమ త్రిపుర జిల్లాల్లో జరుగనున్న మూడు ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించనున్నారు.

click me!