
Rajasthan : రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలపై రాజస్థాన్ ప్రభుత్వం నుండి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) వివరణాత్మక నివేదికను కోరినట్లు సంబంధిత వర్గాలు బుధవారం తెలిపాయి. ప్రభుత్వ వర్గాల ప్రకారం.. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది వెల్లడించాయి. అలాగే, రాష్ట్ర పరిపాలనా మరియు పోలీసు అధికారుల నుండి ఈ మత ఘర్షణల గురించి వివణాత్మక నివేదికలను కోరింది. మంగళవారం ఈద్‌కు కొన్ని గంటల ముందు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్వస్థలం జోధ్‌పూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి.. నగరంలోని 10 పోలీస్ స్టేషన్ ప్రాంతాలలో కర్ఫ్యూ విధించారు.
ఈద్‌కు ముందు రాజస్థాన్‌లో ఘర్షణలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. అల్లర్లు మరింత ముదరకుండా పోలీసులు భారీగా మోహరించారు. అలాగే, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ అల్లర్లకు సంబంధించిన కారణాలు ఇలా వున్నాయి.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో సోమవారం రాత్రి ఈద్‌కు ముందు జలోరీ గేట్ ప్రాంతంలో రెండు వర్గాలకు చెందిన వారు తమ జెండాలు ఎగురవేయడంపై వివాదం చెలరేగిందని పోలీసులు తెలిపారు. మొదట వాగ్వివాదంతో మొదలైన.. ఘర్షణకు దారి తీసిందని తెలిపారు. ప్రజలు పుకార్లు వ్యాప్తి చేయకుండా నిరోధించడానికి జోధ్‌పూర్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. ఈద్ కోసం ప్రార్థన స్థలాలు, కార్యక్రమాలను పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు.
ప్రస్తుతం జోధ్‌పూర్‌లో మూడు రోజుల పరశురామ జయంతి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఈద్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు వర్గాలు పెట్టిన మతపరమైన జెండాలు ఘర్షణలకు దారితీశాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు టియర్-గ్యాస్ షెల్స్ ను ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందిన పలువురు స్థానిక పోలీసు పోస్ట్‌పై దాడి చేశారు. మంగళవారం తెల్లవారుజామున రాళ్లు రువ్వడంతో కనీసం నలుగురు పోలీసులు గాయపడ్డారు. "రాళ్ల దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు భారీ పోలీసు బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు" అని పోలీసు కంట్రోల్ రూమ్‌లోని ఒక అధికారి మీడియాకు తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
"జోధ్‌పూర్, మార్వార్ ల ప్రేమ మరియు సోదర సంప్రదాయాన్ని గౌరవిస్తూ, శాంతిని కాపాడాలని మరియు శాంతిభద్రతలను పునరుద్ధరించడంలో సహకరించాలని నేను అన్ని పార్టీలకు హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాను" అని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్వీట్‌లో పేర్కొన్నారు. శాంతి భద్రతలను కాపాడాలని తాను పరిపాలనను ఆదేశించినట్లు గెహ్లాట్ తెలిపారు.