
ఇంటి నుంచి కాలేజీకి వెళ్లిన ఓ విద్యార్థిని కనిపించని రాని విధంగా కనపడింది. రోడ్డుపై అచేతనంగా పడి కనిపించింది. అది కూడా నగ్నంగా... ఒంటి నిండా కాలిన గాయాలతో... ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో చోటుచేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్ ఆధ్వర్యంలో ని ముముక్ష ఆశ్రమం నిర్వహిస్తున్న స్వామి సుఖ్ దేవానంద్ కాళాశాలలో సదరు విద్యార్థిని బీఏ సెకండ్ ఇయర్ చదువుతోంది. సోమవారం తన తండ్రితో కలిసి ఆమె కళాశాలకు వచ్చింది.
తిరిగి ఇంటికి మాత్రం వెళ్లలేదు. కాలేజీ అయిపోయి చాలా సేపు అవుతున్నా విద్యార్థిని ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కంగారుపడ్డారు. వెంటనే విద్యార్థిని కోసం వెతకడం మొదలుపెట్టారు. కాసేపటికి ఆమె లఖ్ నవూ-బరేలీ జాతీయ రహదారి పక్కన పడిపోయి ఉందని సమాచారం అందింది. పోలీసులు ఆమెను లఖ్ నవూలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
ఆమె శరీరంపై 60శాతం కాలిన గాయాలు ఉన్నాయని.. కనీసం మాట్లాడే స్థితిలో కూడా లేదని.. ఆమె కోలుకుంటే తప్ప.. ఏం జరిగిందో తెలియదని పోలీసులు చెబుతున్నారు.
కాగా.. అదే ప్రాంతంలో మరో అనుమానాస్పద సంఘటన చోటుచేసుకుంది. స్నానం చేయడానికి ఊరి బయట ఉన్న చెరువు దగ్గరకు వెళ్లిన ఐదేళ్ల బాలిక, తనకు సోదరి వయసయ్యే ఏడేళ్ల బాలిక సోమవారం సాయంత్రం అదృశ్యమయ్యారు. వారి కోసం గ్రామస్థులు వెతకగా చిన్నారి శవమై కనిపించింది. మరో బాలిక తీవ్ర గాయాలపాలై కనిపించింది. ఈ ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.