Viral Video: పాము కోసం ఇల్లు కూలగొట్టారు.. పామును కాపాడుతున్న వైరల్ వీడియో ఇదే

Published : Jul 19, 2022, 03:20 AM IST
Viral Video: పాము కోసం ఇల్లు కూలగొట్టారు.. పామును కాపాడుతున్న వైరల్ వీడియో ఇదే

సారాంశం

ఓ నాగు పామును కాపాడటానికి ఇల్లును కూల్చేసిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. రెండు ఇళ్ల గోడల మధ్య ఇరుకైన సందు ఉన్నది. ఈ ఇరుకైన ప్లేస్‌లోనే నాగుపాము చొరబడింది. దాన్ని వెలికి తీయడానికి ఏకంగా ఓ ఇల్లునే కూల్చేశారు. ఆ వీడియో వైరల్ అవుతున్నది.  

చండీగడ్: ఎలుకల కోసం ఇల్లు కాలబెడతామా? అనే సామెత వింటూ ఉంటాం. ఇంట్లో ఎలుకలు ఉంటే వాటిని వెళ్లగొట్టాలి కానీ, వాటి కోసం ఇల్లునే నాశనం చేసుకుంటామా? అనే అర్థంలో ఆ సామెత వాడుతుంటారు. కానీ, వన్యప్రాణులు, జీవుల గురించి తాపత్రయ పడేవారికీ ఈ సామెత లెక్కలోకి రాదు. ఎందుకంటే.. వారు వాటి కోసం ఇల్లునైనా ధ్వంసం చేయడానికి వెనుకాడరు. హర్యానాలో జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనం.

హర్యానా ఫతేహాబాద్‌లోని తొహానా ఏరియాలో ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది. తొహానా ఏరియాలో రెండు ఇల్లు పక్కపక్కనే కట్టి ఉన్నాయి. ఈ రెండు ఇల్ల గోడలు దాదాపు ఆనుకునే కట్టారు. ఈ రెండు గోడల మధ్య ఉన్న కొంత ఖాళీలో ఓ నాగు పాము వచ్చి చేరింది. ఈ పామును కాపాడటానికి స్థానికులు ఎంతో ప్రయత్నాలు చేశారు. చివరకు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ టీమ్‌కు విషయం చేరవేశారు.

వారు ఆ పామును ఎలాగైనా ఆ రెండు గోడల మధ్య నుంచి బయటకు రప్పించాలని ప్రయత్నం చేశారు. కానీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా పాము మాత్రం బయటకు రాలేదు. దీంతో ఆ ఇంటి పైకప్పు, అలాగే, ఆ గోడను కూల్చేయాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ ఇంటి యజమాని నుంచి కూడా అనుమతి తీసుకున్నారు. అనంతరం, మెల్లగా ఆ ఇంటి పై కప్పును కూల్చేశారు. ఆ తర్వాత గోడను ఇటుకల వారీగా కూల్చేస్తూ వచ్చారు. చివరకు ఆ పాము బయటకు వచ్చింది. నాగు పామును చూడటానికి ఇరుగు పొరుగు వారు అక్కడ పోగయ్యారు.

వెంటనే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ టీమ్ ఆ పామును పట్టుకున్నారు. ఓ డబ్బాలో దాన్ని నిర్బంధించారు. అనంతరం, అటవీ ప్రాంతంలో దాన్ని వదిలిపెట్టారు. అయితే, ఈ ఘటనకు చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu