బిజెపిది రామ్ సంస్కృతి, కాంగ్రెస్ ది రోమ్ సంస్కృతి : యోగి ఆదిత్యనాథ్

By Arun Kumar PFirst Published Sep 30, 2024, 11:44 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఒక్కరోజే ఆయన నాలుగు బహిరంగ సభల్లో పాల్గొని బిజెపి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని ప్రజలకు సూచించారు.

Haryana Assembly Elections 2024: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ (మంగళవారం) హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ రోజంంతా హర్యానాలో పర్యటించిన ఆయన నాలుగు బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగించారు. భివానీ ఖేడా నుండి కపూర్ వాల్మీకి, హాన్సీ నుండి వినోద్ భయానా, నారనౌంద్ నుండి కెప్టెన్ అభిమన్యు, సఫీదాన్ నుండి రామ్‌కుమార్ గౌతమ్, పంచ్‌కుల నుండి జ్ఞానచంద్ గుప్తా, కల్కా నుండి శక్తిరాణి శర్మాలను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ఆయన తీవ్రంగా విమర్శించారు. 500 సంవత్సరాల నిరీక్షణకు ముగింపుపలికి జనవరి 22, 2024న ప్రధాని మోడీ చేతుల మీదుగా అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిందని ఆయన అన్నారు. అయోధ్య రామాలయం నిర్మాణంతో మన దేశమే కాదు యావత్ ప్రపంచం సంతోషంగా ఉంది... కానీ దుష్ట కాంగ్రెస్ పార్టీ మాత్రం సహించలేకపోతోందని అన్నారు. రామ సంస్కృతికి, రోమ్ సంస్కృతికి ఇదే తేడా అంటూ గాంధీ కుటుంబాన్ని ఎద్దేవా చేసారు. 

Latest Videos

రామ సంస్కృతిలో పెరిగిన వ్యక్తులు శ్రీరాముడి మర్యాదను పాటిస్తూ 500 సంవత్సరాలు నిరంతరం పోరాడుతూనే ఉన్నారన్నారు. దీని ఫలితమే ఇప్పుడు అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరడం. కానీ రోమ్ సంస్కృతిలో పెరిగిన దురదృష్టవంతులైన 'యాక్సిడెంటల్ హిందువులు' దీనిని సహించలేకపోతున్నారని ఆయన అన్నారు. యాక్సిడెంటల్ హిందువులకు దేశం, ప్రజల పట్ల ఎప్పుడూ విశ్వాసం వుండదన్నారు. శ్రీరాముడు భారతదేశానికి ప్రతీక, ఆయనను అంగీకరించని వారు మనకు ఎందుకూ పనికిరాని వారని ఆయన అన్నారు.

  

రాహుల్ గాంధీపై యోగి సీరియస్

ఇటీవల రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం యోగి... అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై విమర్శలు తగవన్నారు. హిందువులను అవమానించడం, సనాతన సంస్కృతిని దూషించడం,  భారతదేశం వెలుపల రాజ్యాంగ సంస్థలను నిందించడం ద్వారా కాంగ్రెస్ నాయకుల అసలు రంగు బయటపడిందన్నారు.

1526లో రామ మందిరాన్ని కూల్చివేసి బానిసత్వం యొక్క నిర్మాణాన్ని నిర్మించారని... ముస్లింలు.బ్రిటిష్ వారు హిందూ మతం, సంస్కృతి యొక్క జాడలను తొలగించాలని కోరుకున్నారని యోగి అన్నారు. కానీ స్వాతంత్య్ర భారతదేశంలో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దురదృష్టవంతులు కూడా భారతదేశాన్ని గర్వంగా నిలబెట్టడానికి అనుమతించలేదని ఆయన అన్నారు.

2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారని 2017లో ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక... డబుల్ ఇంజిన్ ప్రభుత్వం డబుల్ స్పీడ్‌తో పరిగెత్తడం ప్రారంభమయ్యిందన్నారు., కేవల రెండు సంవత్సరాలలో ఐదు వందల సంవత్సరాల సమస్యకు పరిష్కారం లభించిందని ఆయన అన్నారు. 140 కోట్ల మంది భారతీయులు సంతోషంగా ఉన్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ బాధపడుతోందని ఆయన అన్నారు.

కాంగ్రెస్ వాళ్ళు వస్తే దేశద్రోహం చేస్తారని ప్రజలకు తెలుసు

భివానీ ఖేడా అసెంబ్లీ ప్రజలను అభినందిస్తూ సీఎం యోగి మాట్లాడారు.  కాంగ్రెస్ వాళ్ళు వస్తే దేశానికి ద్రోహం చేస్తారని ఇక్కడి ప్రజలకు తెలుసని అన్నారు. అభివృద్ధి పేరుతో వారు తమ ఇళ్లను మాత్రమే నింపుకున్నారని... కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి ఎలాంటి పని చేయలేదన్నారు. అయితే హర్యానాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వ హయాంలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు.

దేశ వనరులపై మొదటి హక్కు ముస్లింలదని కాంగ్రెస్ నాయకులు చెప్పేవారని, అయితే దేశ వనరులపై మొదటి హక్కు పేదలు, బలహీనవర్గాలు, దళితులు, వెనుకబడిన వర్గాలదని మోడీ అంటున్నారని ఆయన అన్నారు. మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా అవతరిస్తోందని ఆయన అన్నారు. భారతదేశంలో కరోనా సమయంలో ఇప్పటివరకు 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందిస్తున్నారని, మరోవైపు పాకిస్తాన్ బిక్షం ఎత్తుకుంటోందని యోగి అన్నారు.

కాంగ్రెస్ పార్టీ స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచిపెట్టింది

60-65 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీకి దేశాన్ని దోచుకుని డబ్బును స్విస్ బ్యాంకుల్లో దాచిపెట్టుకుంది... కానీ మోడీ వచ్చాకే దేశంలో అభివృద్ది ప్రారంభమైందని అన్నారు.  కరోనా సమయంలో బిజెపి కార్యకర్త ప్రధాని మోడీ, జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పిలుపు మేరకు 'సేవ యాత్ర' నిర్వహిస్తున్నప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. కష్ట సమయాల్లో ఆయనకు భారతదేశం గుర్తుకురాలేదని, ఇటలీలోని తన అమ్మమ్మ గుర్తుకువచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు.

బంధుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఆర్టికల్ 370ని అమలు చేశారు

ప్రధాని మోడీ నాయకత్వంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగిందని, ఆర్టికల్ 370 రద్దు చేయబడిందని సీఎం యోగి అన్నారు. బాబాసాహెబ్ భీమ్‌రావు అంబేద్కర్ వ్యతిరేకించినా కాంగ్రెస్ పార్టీ బంధుత్వాన్ని నిలబెట్టుకోవడానికి రాజ్యాంగంలో ఆర్టికల్ 370ని చేర్చి, కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించిందని... దీని ఫలితంగా దేశం ఉగ్రవాదానికి గురైందని ఆయన అన్నారు. హిందువులు ఒకరితో ఒకరు పోట్లాడుకునేలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని సృష్టించిందని ఆయన ఆరోపించారు.

భయంకరమైన మాఫియాతో కాంగ్రెస్ పార్టీ వ్యాపార భాగస్వామ్యాన్ని కలిగి ఉంది

దురదృష్టవశాత్తూ, ఉత్తరప్రదేశ్‌లో ప్రతి మూడు రోజులకు ఒకసారి అల్లర్లు జరుగుతుండేవని, కానీ ఏడున్నర సంవత్సరాలుగా అల్లరి మూకలు జైలులో ఉన్నాయని లేదంటే నరకానికి వెళ్లిపోయాయని సీఎం యోగి అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు కర్ఫ్యూ లేదు, అల్లర్లు లేవు... ఎందుకంటే అక్కడ అంతా బాగుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్‌లోని భయంకరమైన మాఫియాకు ఆశ్రయం కల్పించిందని, వారితో వ్యాపార భాగస్వామ్యాన్ని కలిగి ఉందని ఆయన ఆరోపించారు. మైనింగ్, పశువులు, అడవులు, భూ మాఫియా కాంగ్రెస్ పార్టీ శిష్యులని, అందుకే కాంగ్రెస్ పార్టీని అధికారం నుండి దూరంగా ఉంచాలని ఆయన అన్నారు.

 

ఉగ్రవాదం, తీవ్రవాదం, అవినీతికి కాంగ్రెస్ పార్టీ మూలం

భారతదేశంలో సుపరిపాలనకు రామరాజ్యమే ఆధారం కాగలదని మహాత్మా గాంధీ అన్నారని సీఎం యోగి అన్నారు.  కాంగ్రెస్ పార్టీ సమస్య అయితే బిజెపి పరిష్కారమని, కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం, అవినీతికి మూలమని ఆయన అన్నారు. రోమ్-ఇటలీ గురించి మాట్లాడే కాంగ్రెస్ నాయకులు అక్కడికే వెళ్లాలని, వారు హర్యానా, హాన్సీ, హిసార్ నుండి ఓట్లు ఎందుకు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు.

 కాంగ్రెస్ పార్టీకి రాముడు, కృష్ణుడిపై నమ్మకం లేదని సీఎం యోగి ఆరోపించారు.హిందు దేవుళ్లకు భూములు ఉండకూడదని, వక్ఫ్ బోర్డు కోసం మాత్రమే భూమి ఉండాలని వారు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. అందుకే చాంద్ మొహమ్మద్‌కు టికెట్ ఇచ్చి పంచ్‌కులను దోచుకోవడానికి పంపారని ఆయన అన్నారు. భగవాన్ రామ, కృష్ణ కూడా దురదృష్టవంతులైన కాంగ్రెస్ పార్టీ వైపు నుండి తమ ముఖాలను తిప్పుకున్నారని ఆయన అన్నారు.

పని చేయడానికి ధైర్యం, బలమైన ప్రభుత్వం అవసరమని సీఎం యోగి అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ ధైర్యం సన్నగిల్లుతోందని, హర్యానాలో తమ పప్పులు ఉడకవని వారికి అర్థమైందని ఆయన అన్నారు. అక్టోబర్ 5న హర్యానాలో ఎన్నికలు, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుందని సీఎం యోగి అన్నారు. అక్టోబర్ 3 నుండి   నవరాత్రులు ప్రారంభమవుతాయని, అక్టోబర్ 12న విజయదశమి అని ఆయన అన్నారు.  పండక్కి ముందే ఇక్కడ కమలం పువ్వు వికసించాలని ఆయన అన్నారు.

బహిరంగ సభల్లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, భజన గాయకుడు కన్హయ్య మిట్టల్, ఉత్తరప్రదేశ్ మంత్రి బ్రిజేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

 

click me!